అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఓ ఖరీదైన వజ్రం లభించింది. దేవాదాయ శాఖ ఆధికారులు గురువారం హుండీ లెక్కింపును చేపట్టగా.. అందులో వజ్రాన్ని గుర్తించారు. ఆ వజ్రం 1.39.6 క్యారెట్లు ఉన్నట్లు ఆధికారులు తేల్చారు. ఓ అజ్ఞాత భక్తుడు వజ్రంను ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వేసినట్లు దేవాదాయ శాఖ ఆధికారులు తెలిపారు. తమకు హుండీలో వజ్రం, టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖ కూడా దొరికిందని చెప్పారు.
‘నాకు వజ్రం దొరికింది. నిజమైనదని నిర్ధారించుకున్న తర్వాతే హుండీలో వేస్తున్నా. వజ్రం అమ్మలేక, భరించలేక, వస్తువుగా తయారు చేసి ఇచ్చే శక్తిలేక ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వేస్తున్నా. ఈ వజ్రంను ఆలయానికి ఉపయోగ పడేలా చూడాలని కోరుతున్నా’ అని హుండీలో వేసిన లేఖలో అజ్ఞాత భక్తుడు రాసుకొచ్చాడు. రాజంపేట దేవాదాయ శాఖ తనిఖీ అధికారి జనార్దన్, ఆలయ ఈవో కొండారెడ్డిలు సదరు వజ్రంను ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామికి అప్పగించారు. ప్రస్తుతానికి వజ్రాన్ని జాగ్రత్తగా ఉంచమని, ఆలయానికి ఉపయోగ పడేలా ఏం చేయాలో ఆలోచిద్దాం అని అర్చకుడికి చెప్పారు.
Also Read: Yogandhra 2025: విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి.. ఫుల్ లిస్ట్ ఇదే!
ఇక ఆంజనేయ స్వామి ఆలయం హుండీలో ఖరీదైన వజ్రం లభించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వజ్రంను ఎవరు హుండీలో వేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అజ్ఞాత భక్తుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వజ్రాన్ని అమ్ముకోకుండా.. హుండీలో వేయడం గ్రేట్ అని పొగుడుతున్నారు. ఆ అజ్ఞాత భక్తుడిపై ఆంజనేయ స్వామి దీవెనెలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు.