ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు ఆగస్ట్ ఒకటో తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన రూ.8కోట్ల నగదు సహా డిస్టిలరీలు, నిందితుల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీ మరియు ధరల నిర్ణయంలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మద్యం స్కామ్‌లో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి విచారించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కుంభకోణానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెలికితీసే దిశగా సిట్ ప్రయత్నిస్తోంది.
Also Read: Thalassemia Disease: తలసేమియాపై అవగాహన.. ఆర్కే బీచ్‌లో 3కె, 5కె, 10కె రన్!
మరోవైపుకు మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. మద్యం కేసులో తనపై సిట్ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది. బుధవారం వరకు ఆయనపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.