Andhra Pradesh: ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతపరిచేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆ శాఖ కేంద్ర కార్యదర్శితో ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సమావేశమయ్యారు. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన రూ. 650 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు.
Read Also: Minister Narayana: డిసెంబర్ మొదటి వారం నుంచి అమరావతి నిర్మాణ పనులు
ఏపీ ఎఫ్ఎస్ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9.7 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 6200 పాఠశాలలు, 1978 ఆరోగ్య కేంద్రాలు, 11254 గ్రామ పంచాయతీలు, 5800 రైతు కేంద్రాలకు, 9104 ప్రభుత్వ కేంద్రాలకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నట్టు కేంద్రానికి ఏపీ సర్కారు వివరించింది. తక్షణం 35 లక్షల సీపీఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం తెలిపింది. భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు.