Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా అనంతపురం జిల్లాకు కూలీగా పని చేస్తానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న పయ్యావుల కేశవ్‌కు సోమవారం మండలంలోని బాట సుంకులమ్మ ఆలయ సమీపంలో ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయన ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మీద నమ్మకంతో ఆర్థిక శాఖను అప్పగించారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా ప్రజల కష్టాలు తీర్చడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని పేర్కొన్నారు.
Read Also: YSRCP: వైసీపీకి షాక్.. రాజీనామా చేసిన మాజీ మంత్రి
నమ్మి ఓట్లు వేసిన ప్రజలు, అధినేత చంద్రబాబు నమ్మకానికి శక్తికి మించి పని చేస్తానని మంత్రి వెల్లడించారు. ఇంకా రికార్డులు చూడలేదని.. ఐదేళ్లుగా ఏం జరిగిందో తవ్వి తీయడానికే సమయం అయిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు సంబంధించి ఇంకా లెక్కలు చూడలేదని.. లెక్కలు చూస్తే అసలు విషయాలు బయటపడతాయన్నారు. ప్రజానీకం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా మంత్రులు అందరం పని చేస్తామన్నారు. నీటికోసం పోరాటాలు, ఆరాటాల మధ్య పెరిగిన వ్యక్తినని.. అందరి అంచనాలు, ఆలోచనలకు అనుగుణంగానే పని చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.