Minister Buggana Rajendranath: ఏపీలో వైద్యరంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశామని మంత్రి తెలిపారు. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ 16,852 కోట్లు వ్యయం చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్య భరోసాను అందిస్తున్నామన్నారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధం పెట్టామని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని, ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ రోగులకు కార్పొరేట్ ప్రమాణాలతో ఉచిత వైద్యం అందిస్తున్నామని మంత్రి వివరించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని… జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కోటీ 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నామని.. 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియమించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ చెప్పారు.
Read Also: AP Budget 2024: ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన.. చాణక్యుడి పాలన అందిస్తున్నాం..
రైతన్నలకు వెన్నుదన్నుగా..
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని మంత్రి బుగ్గన చెప్పారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి రూ.14,129 కోట్లు ఖర్చు చేశామన్నారు. జగనన్న పాలవెల్లువ కింద రూ.2, 697 కోట్లు ఖర్చు చేశామన్నారు. 53.58 లక్షల మంది రైతులకు 33,300 కోట్ల రూపాయల మేర రైతు భరోసా ఆర్ధిక సాయం అందించామని.. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఒన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశామన్నారు. అటవీ భూముల సాగుదారులకు రూ.13, 500 ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. రైతుల కోసం రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37,374 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. ఇదిలా ఉండగా.. ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. 2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలు స్థాపించామన్నారు. తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వాహబ్‌గా తయారైందన్నారు. మత్య్సకార భరోసా పథకం ద్వారా 2 లక్షల 43 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4 వేల నుంచి 10 వేలకు పెంచామన్నారు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4,363 కోట్లు అందించామని.. 2,356 మంది ఉద్యానవన సహాయకులు నియమించామని మంత్రి బుగ్గన వెల్లడించారు.
Read Also: AP Budget 2024: ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,86, 389 కోట్లు
తలసరి ఆదాయంలో 9వ ర్యాంక్
ఐదేళ్ల కాలంలో 30 లక్షల పైచిలుకు ఇళ్లపట్టాల పంపిణీ చేసి సంక్షేమాంధ్రగా ఏపీని మార్చామని మంత్రి పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా 2.53 లక్షల కోట్లను పంపిణీ చేశామన్నారు. తలసరి ఆదాయం రూ.2,19,518లతో దేశంలోనే 9 ర్యాంక్‌లో ఏపీ నిలిచిందన్నారు. పెన్షన్ కానుక ద్వారా 84 వేల కోట్లను అందించామన్నారు. ఐదేళ్లలో ప్రజా పంపిణీలో ఇంటిముంగిటకే సరకులను పంపేలా సంచార పంపిణీ వాహనాలు పెట్టామన్నారు. తద్వారా బీసీ ఎస్సీ,ఎస్టీ యువతకు ఉపాధి కూడా దొరికిందన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్లు ఖర్చు చేశామని మంత్రి చెప్పారు. 2019 వరకూ రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలను పెంచి వైసీపీ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలను నిర్మించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఏపీ పారిశ్రామిక పాలసీ 2019-27ను తీసుకొచ్చామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం చేపట్టాం. పోర్టుల నిర్మాణం ద్వారా 75 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. రూ.3,800 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని మంత్రి వివరించారు. 55 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఫైబర్ గ్రిడ్‌తో ప్రతీ గ్రామాన్ని అనుసంధానించామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.