AP Assembly Budget Sessions 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత్ర గ్రంథంగా భావించారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని తెలిపారు. బుగ్గన, ఆర్థిక మంత్రి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్ర సమస్యల్ని పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామని ఆయన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వ చర్యలు తీసుకుందన్నారు. పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికీ సాధికారిత అందించామన్నారు. విద్యార్ధులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్దులను సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతీ విద్యార్ధికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం చేశామన్నారు. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారిందన్నారు.
Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
అసెంబ్లీలో బుగ్గన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు మా ప్రభుత్వం చేసింది. సుపరిపాలన ఆంధ్ర, సామర్ధ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర ,భూభద్ర ఆంధ్రను సాధించాం. పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు. కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశాం. అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశాం. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టాం. సామర్ధ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టాం.” అని తెలిపారు.
2024-25 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2,86,389 కోట్లతో బడ్జెట్.
రూ. 2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం.
రూ.30,530 కోట్ల మూలధన వ్యయం.
రూ.24,758 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు.
రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు అంచనా.
రాష్ట్రస్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు.
రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 1.56 శాతం.