ఏపీ ఫైబర్ నెట్ ఎండీ, ఈడీ, అధికారులపై ఛైర్మన్ జీవీ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫైబర్ నెట్ అధికారుల్లో లెక్కలేనితనం, ఒళ్లు బద్ధకం కనిపిస్తున్నాయని మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు వెళ్లకుండా రూ.337 కోట్ల పెనాల్టీ పడేలా చేశారన్నారు. తనకు అకౌంట్స్ బుక్స్ ఇవ్వడం లేదని, అధికారులు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారని, ఫైబర్ నెట్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో నిర్వహించి మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు.
‘ఫైబర్ నెట్ విజిలెన్స్‌కు అధికారులు సహకరించలేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు. కోర్టు ఇచ్చిన నోటీసు ప్రకారం కోర్టుకు అటెండ్ కాకుండా.. రూ. 337 కోట్లు పెనాల్టీ పడేలా చేశారు. చైర్మన్‌కు అకౌంట్స్ బుక్స్ ఇవ్వకుండా ఎవరిని కాపాడాలనుకుంటున్నారు. సుబ్బారాయుడు అండ్ కోఆడిటర్లు ఆడిట్ చేస్తామని లెటర్లు రాస్తే.. రిప్లై కూడా ఇవ్వలేదు. బిజినెస్ చేయడం లేదు.. ఉన్న బిజినెస్ పోగొడుతున్నారు. ఎండీ, ఈడీలు చేయాల్సిన పని చేయడం లేదు. ఎండీ దినేష్ కుమార్, ఈడీలపై ఏపీ సీఎస్ విజయానంద్, అడ్వకేట్ జనరల్ లకు ఫిర్యాదు నేను చేస్తా’ అని జీవీ రెడ్డి చెప్పారు.
‘అవినీతితో పాటు ఏపీఎస్ఎఫ్ఎల్లో ద్రోహం చేసే చర్యలున్నాయి. లెక్కలేని తనం, ఒళ్లు బద్ధకం అధికారుల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అధికారులు చేస్తోంది రాజద్రోహం. రావాల్సిన బిజినెస్ డైవర్ట్ చేస్తున్నారన్నదే రాజద్రోహం. పెట్టుబడి పెట్టి పని చేస్తామని అనుమతులు అడిగిన కేబుల్ ఆపరేటర్ల పట్ల అధికారుల వైఖరి దారుణంగా ఉంది. అధికారులు ఏపీఎస్ఎఫ్ఎల్ పైన అసలు టైం పెట్టలేదు. అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారా? అనే దానిపైన సీఐడీ విచారణ జరుపుతారా అనేది సీఎస్, అడ్వకేట్ జనరల్ ఏం చెపుతారో అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సహకరించికపోతే ఉద్యోగాల్లోంచీ తీసేస్తా అని నోటిఫికేషన్ ఇస్తే.. అధికారులు కార్యాలయానికి రావడం మొదలైంది. విజిలెన్స్ ఎంక్వైరీకి ఎండి దినేష్ కుమార్ సపోర్టు చేయడం లేదు. నేను చేసే ఆరోపణలు అన్నీ ఆన్ రికార్డ్’ అని జీవీ రెడ్డి తెలిపారు.