ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మార్చి 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. బుధవారం (ఏప్రిల్ 24) శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188 కిమీ మేర సాగిన బస్సు యాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ఇక మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార భేరిని సీఎం మోగించనున్నారు.
ఏప్రిల్ 28 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం మొదలెట్టనున్నారు. 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో సీఎం పాల్గొంటారు.
Also Read: Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సన్నాహాలు..
ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు (ఏప్రిల్ 27) వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోను సీఎం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిన సీఎం.. ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు.