AP CM Jagan: వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు పౌరసరఫరాలశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందని.. దీనివల్ల 73 శాతం మేర సాగు అయిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ముందస్తు రబీకి రైతులు సిద్ధం అవుతున్నారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో ముందస్తు రబీ పంటలు వేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శనగ సహా ఇతర విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు వెల్లడించారు. రబీలో సాగుచేసే శెనగ విత్తనాలపై సబ్సిడీని 25% నుంచి 40 శాతానికి పెంచామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విత్తనాల పంపిణీ చురుగ్గా సాగుతోందని అధికారులు పేర్కొ్న్నారు. సుమారు లక్ష క్వింటాళ్ల శనగ విత్తనాలు సిద్ధం చేశామని సీఎంకు చెప్పారు. ఇందులో ఇప్పటికే 45 వేల క్వింటాళ్ల పంపిణీ చేశామని అధికారులు స్పష్టం చేశారు. ఎరువుల లభ్యతలో ఎలాంటి సమస్యా లేదని అధికారులు పేర్కొన్నారు. రైతుల అవసరాలకు తగిన విధంగా నిల్వలున్నాయని వెల్లడించారు.
ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటికే 85శాతం ఇ–క్రాప్ పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు. అక్టోబరు 15లోగా నూరుశాతం ఇ– క్రాపింగ్ పూర్తిచేస్తామని తెలిపారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలుకు సమాయత్తమవుతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Also Read: Nara Lokesh: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ విచారణ..
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే….:
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధర ఇవ్వడంతో పాటు, జీఎల్టీ రూపంలో క్వింటాలుకు సుమారు రూ.250లపైనే అదనంగా రైతులకు లభిస్తోందన్నారు. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలతో రైతులకు మేలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. ఎప్పటిలానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలని సీఎం ఆదేశించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులు మిల్లర్లను ఆశ్రయించాల్సిన అవసరం రాకూడదని సీఎం సూచించారు. ధాన్యంతోపాటు చిరుధాన్యాలనూ కొనుగోలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిల్లెట్స్ సాగుచేస్తున్న రైతులకు తోడుగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏర్పాటు చేస్తున్న యూనిట్లను ఉపయోగించుకుని ఈ మిల్లెట్స్‌ను ప్రాసెస్ చేయాలని సీఎం సూచించారు. ప్రతిఏటా రైతులనుంచి తృణధాన్యాలు కొనుగోలు పెరిగే అవకాశాలున్నందున ఆ మేరకు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సీఎం అన్నారు. పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మిల్లెట్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలన్నారు.
Also Read: Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై మూడు వైపుల నుంచి దాడి.. పోరాడుతున్న ఐడీఎఫ్
ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద ఇప్పటివరకూ రూ.31,005.04 కోట్లు వైయస్.జగన్ ప్రభుత్వం అందించింది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిలో డీఆర్‌ఓజీఓ, ఆర్‌టీపీఓ కేంద్రాల్లో ఔత్సాహికులైన వారికి కిసాన్ డ్రోన్లపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటివరకూ 422 మందికి శిక్షణ అందించినట్లు అధికారులు తెలిపారు. నవంబర్ మూడోవారం నాటికి నాటికి మండలానికి ఒకరికి చొప్పున శిక్షణ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. వీరిద్వారా మిగతా వారికి శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనికి అవసరమైన పరికరాలు ఆర్బీకేల్లో ఉంచేలా చూడాలన్నారు. దీనికోసం అవసరమైన ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. పంట వేసే ముందు భూసార పరీక్షలు జరగాలని, ఆమేరకు సర్టిఫికెట్ ఇచ్చేలా ఉండాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఏ పంటలు వేయాలి? ఏయే రకాల ఎరువులు ఎంత మోతాదులో వేయాలన్న దానిపై రైతులకు పూర్తి వివరాలు అందించేలా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనివల్ల అవసరమైనంతమేరకే ఎరువులను వినియోగిస్తారని, రైతులకు కూడా ఖర్చులు కలిసి వస్తాయన్నారు.
Also Read: IND vs AFG: భారీ స్కోరు చేసిన అఫ్గాన్ జట్టు.. భారత టార్గెట్ ఎంతంటే?
చేయూత కింద మహిళలకోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. సుస్థిర జీవనోపాధి మార్గాలు ఏర్పాటుకావాలని, దీనిపై నిరంతరం సమీక్ష జరగాలన్నారు. చేయూత కింద ఇస్తున్న డబ్బుకు అదనంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. అవి విజయవంతంగా నడిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అమూల్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే చాలామంది లబ్ధి పొందుతున్నారన్న అధికారులు, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు సీఎం జగన్. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాల్లో మహిళలకు స్వయం ఉపాధి మార్గాలు బలోపేతంగా నడవాలని సూచించారు. పశుగ్రాసం, దాణా కొరతలేకుండా చూసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.ప్రతి ఆర్బీకేని యూనిట్‌గా తీసుకుని టీఎమ్మార్ ఇచ్చేలా చూడాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.