Off The Record: వల్లభనేని వంశీ…. ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. గన్నవరం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. అదే పార్టీ తరపున ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024లో వైసీపీ బీ ఫామ్ మీద బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అయితే… 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీకి జై కొట్టారు వంశీ. ఆ క్రమంలోనే… 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ళు టిడిపి రెబెల్ ఎమ్మెల్యేగా… చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ నేతలపై హద్దులు మీరి మాట్లాడారంటూ ఇప్పటికీ గుర్రుగా ఉంటారు టీడీపీ నాయకులు. అలా హద్దు మీరడం వల్లే…. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ మీద ఫోకస్ పెట్టినట్టు చెప్పుకుంటారు.దీంతో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో పాటు వరుస కేసులతో జైలుకు వెళ్ళి వచ్చారు కూడా. ఆ సమయంలో గన్నవరం వైసీపీ శ్రేణులు సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడ్డాయి.
అయితే… ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని, కేసుల భయం పోయి వంశీ మెల్లిగా నియోజకవర్గం మీద దృష్టి పెడుతున్నట్టు చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వం వచ్చాక వంశీ మీద 11 కేసులు నమోదయ్యాయి. గత ఫిబ్రవరి 11న ఆయన్ని హైదరాబాదులో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 140 రోజులు జైల్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. ఆ టైంలో…. గన్నవరం నియోజకవర్గం వైసీపీ శ్రేణులు సరైన దిశా నిర్దేశం లేక ఎక్కడికక్కడ సైలెంట్‌గా ఉండిపోయారు. అనేకమంది ఆయన ప్రధాన అనుచరుల మీద కూడా కేసులు నమోదవడం, అరెస్టులు జరగడంతో… మొత్తం ఎక్కడికక్కడ కామ్ అయిపోయారు. ఇంకొంతమంది అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక 140 రోజుల జైలు జీవితం తర్వాత బయటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కూడా రకరకాల కారణాలతో ఇంటికే పరిమితం అయ్యారు. అయితే… అదంతా గతం అంటూ…ఇప్పుడిప్పుడే రీ ఛార్జ్ మోడ్‌లోకి వస్తున్నారట వల్లభనేని. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేయడం చూస్తుంటే… తాను తిరిగి యాక్టివ్ అయ్యానని కేడర్‌కు సందేశం పంపడమేనని అంటున్నారు విశ్లేషకులు. ఇక నుంచి పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద పూర్తిస్థాయిలో ఫోకస్ పెడతారన్నది ఆయన సన్నిహితుల మాట. అందుకు తగ్గట్టే వివిధ మండలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకి 10 కార్యక్రమాల చొప్పున సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఆ మీటింగ్స్‌లో అన్ని వర్గాలను కలుస్తున్నారు వంశీ. తన ఓటమికి కారణాల మీద కూడా దృష్టి పెట్టి సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దీంతోపాటు గత ఎన్నికల్లో వైసీపీలో గ్రూపుల వివాదం వల్ల నష్టం జరిగిందన్న అభిప్రాయం ఉంది. కొన్ని వర్గాలు తనకు దూరంగా ఉన్నాయని గ్రహించి ఇప్పుడు అన్ని గ్రూపులను కలుపుకొని పనిచేయటానికి వంశీ సిద్ధమవుతున్నారట. తన వర్గంలో కేసులున్న వారికి అండగా నిలబడతానని, ఇకపై కేసుల భయం అనేది పక్కనపెట్టి పూర్తిస్థాయిలో పనిచేయండని కూడా చెబుతున్నట్టు సమాచారం. ఆ విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వంశీ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. వంశీ సుడిగాలి పర్యటనలను అటు అధికార పార్టీ కూడా ఓ కంట కనిపెడుతోందట. ఆయన ఎవరెవర్ని కలుస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారంటూ… ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తోందట. కానీ… రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచాలనుకుంటున్నట్టు వంశీ వర్గం చెప్పడం ఆసక్తికరంగా మారింది. ముందు ముందు గన్నవరం పాలిటిక్స్ ఎంత గరం గరంగా మారతాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.