స్వగ్రామం నారావారిపల్లెలో సోదరుడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారావారిపల్లెకు చేరుకున్న సీఎం.. నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్ కూడా హాజరయ్యారు.
నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలో మంత్రులు వంగలపూడి అనితా, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి, ఎస్ సవితా, వాసం శెట్టి సుభాస్, అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, నిమ్మకాయల చిన్న రాజప్ప, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. రామమూర్తి నాయుడు అనారోగ్యంతో ఈనెల 16వ తేదీన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
Also Read: TTD: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి ఆనం
రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర.. కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. నారా రోహిత్ హీరో అన్న విషయం తెలిసిందే. 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రామ్మూర్తి నాయుడు.. 1994లో ఎన్టీఆర్ ఆశీస్సులతో చంద్రగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. గల్లా అరుణకుమారిపై 16 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 1999 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో టికెట్ దక్కే పరిస్థితి లేదని తెలుసుకున్న ఆయన 2003లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ 2004 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందారు.