AP Budget 2024: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. రేపు ఉదయం అనగా బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అయితే, అంతకు ముందు ఉదయం 8 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన.. సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో మంత్రి మండలి భేటీకానుంది.. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఇక, ఆ తర్వాత ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 11 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. దాదాపు రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను సమర్పించే అవకాశం ఉంది.. దీనిపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డిసెంబర్‌లోనే అంచనాలు తీసుకుని కసరత్తు చేసింది సర్కార్.. ఇక, దాదాపు రూ.3.20 లక్షల కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో.. ప్రభుత్వం ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.