Purandeswari vs Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి, వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య రోజురోజుకూ వార్ ముదురుతోంది.. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి పురంధేశ్వరి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలి.. విజయసాయి రెడ్డే కాదు.. వైఎస్ జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు అంటూ ఆమె సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని రాసుకొచ్చిన పురంధేశ్వరి.. CBI, IT, ED కేసుల దర్యాప్తు జరగకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటున్నారు. విచారణలు, వాయిదా వేయిచుకోవడం, విచారణకు హాజరు కాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగులో ఉంటున్నాయి. విజయ సాయిరెడ్డిపై IPC కింద నమోదైన కేసులు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సెక్షన్ల కింద విజయ సాయిరెడ్డిపై నమోదైన కేసులను పరిశీలిస్తే తిమ్మిని బమ్మిని చేయగలరని అర్థమవుతోందని పేర్కొన్న ఆమె.. వైఎస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు విజయ సాయిరెడ్డి. జగన్ కేసులో సాయిరెడ్డిని కింగ్‌పిన్ అని సీబీఐ స్పష్టం చేసిందని గుర్తుచేశారు.. అంతగా ప్రభావ వంతం చేయలేని పరిస్థితుల్లో విజయసాయిపై కేసులు నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు విజయసాయు అత్యున్నత పదవుల్లో ఉన్నారని తెలిపారు.
ఇక, ఇప్పుడు ఏపీలో వేలాది కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకుంటున్నారు.. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా పలుకుబడిని ఉపయోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి ఆ తర్వాత అప్రూవరుగా మారిన వారు విజయసాయి దగ్గరి బంధువులే అని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. విజయసాయి రెడ్డి తన బినామీల ద్వారా ఏపీలోని కొన్ని డిస్టలరీలను నిర్వహిస్తున్నారు. ఈ అంశం వెలుగులోకి రాగానే ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోం మంత్రికి లేఖలు కూడా రాశాం. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీగా ఉన్న సమయంలో విజయ సాయి చాలా మందిని బెదిరించి వారి ఆస్తులు కబ్జా చేయించారని.. బలవంతంగా డబ్బు వసూళ్లు చేశారని.. దీనికోసం సీఎం సొంత జిల్లా కడప నుంచి తెప్పించిన గూండాలను ఉపయోగించారు. అనేక మంది వ్యాపార వేత్తలు, రియల్టర్లను బెదిరించి నామ మాత్రపు డబ్బు చెల్లించి విలువైన భూములు గుంజుకున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు.
విజయసాయి కూతురు, అల్లుడు కంపెనీల కోసం అనేక ఎకరాల విలువైన భూమిని తక్కువ ధరకు ఇచ్చేలా అధికార దుర్వినియోగం చేశారని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి.. విశాఖపట్నం సమీపంలోని భీమిలిలో రూ. దాదాపు రూ. 177 కోట్ల భూములను విజయ సాయిరెడ్డి కుమార్తె కంపెనీ కేవలం రూ. 57 కోట్లకే కొనుగోలు చేసింది. వాస్తవానికి విజయ సాయిరెడ్డి దస్పల్లా భూములను బెదిరించి స్వాధీనం చేసుకున్నారు. న్యాయ వివాదంతో అప్పటి వరకు ప్రభుత్వ నిషిద్ధ జాబితాలో ఉన్న దస్పల్లా భూములను.. ఒప్పందం కుదిరిన వెంటనే నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. విజయసాయి రెడ్డి ఈ బెయిల్ పై ఉండడం వల్లే ఇవన్నీ చేయగలిగారు. విజయసాయి బంధువులు, బినామీలు రుషికొండలోని బే పార్క్ రిసార్ట్ బేరసారాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా భూమి, ఇసుక, మైనింగ్, మద్యంలో విజయసాయి.. ఆయన బినామీల అక్రమాలపై చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ సమస్యలలో కొన్నింటిని బాధ్యత కలిగిన పౌరురాలిగా ప్రజా బాహుళ్యంలో లేవనెత్తాను. దీనిపై బహిరంగంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి నన్ను బెదిరించారు.. నేను ఇటువంటి అంశాలను నా వద్ద ఉన్న సమాచారంతో భవిష్యత్తులో మాట్లాడితే, నన్ను ప్రజల మధ్య బయట తిరగకుండా చేస్తానని వ్యక్తిగత దూషణలతో విజయసాయి రెడ్డి నన్ను బెదిరించారు.. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే విజయసాయిరెడ్డి ఎలా బెదిరిస్తారోననే దానిపై నన్ను బెదిరించిన తీరే నిదర్శనంగా పేర్కొన్నారు.
ఏపీలోని పెద్దలు, వ్యాపారవేత్తలు సాధారణ ఫోన్లలో మాట్లాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి.. విజయసాయికి భయపడి వాట్సాప్ కాల్స్ లేదా పేస్ టైంలు మాత్రమే వాడుతున్నారు. ఈ బహిరంగ బెదిరింపులను బెయిల్ షరతుల ఉల్లంఘనగా పరిగణించాలి. గత పదేళ్లుగా అనేక ఉల్లంఘనలతో అతను వ్యవస్థలను ఎలా నియంత్రిస్తున్నారోననేది పరిశీలించాలి. విజయసాయి రెడ్డి బెయిల్‌ను పొడిగించడాన్ని పరిశోధించాలి. ఇంతకు ముందు జరిగిన ఒక సంఘటనలో కూడా మాజీ ఎంపీ వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేసినప్పుడు.. ప్రెస్ మీట్ పెట్టి అది కేవలం గుండెపోటు అని చెప్పారు. వివేకాది సహజ మరణమని చెప్పిన మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనే అంశం పరిగణలోకి తీసుకోవాలి. 10 ఏళ్లుగా వ్యవస్థలోని కొన్ని అవకాశాలను వినియోగించుకుని బెయిల్‌పై ఉన్నారు. వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి బెయిల్‌ను తక్షణమే రద్దు చేయాలి. వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ ఒక కొలిక్కి తేవాలి. దోషులని తేలిన వారిపైన న్యాయపరమైన చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ పౌరులకు మరింత హాని జరగకుండా నిరోధించాలని తన లేఖలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ను తన లేఖలో విజ్ఞప్తి చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి.