Purandeshwari: సిద్దాంతపరంగా భావజాలం కుదరని పార్టీలతో విపక్షాల కూటమి ఏర్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఓడించేందుకే కూటమిగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు ఉందని ఆమె ఆరోపించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులతో సహా గత ప్రభుత్వ హయాంలో రూ. 2.65 లక్షల కోట్ల మేరకు అప్పు చేశారని విమర్శించారు. అనధికార అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. -పురంధేశ్వరి
పురంధేశ్వరి మాట్లాడుతూ.. “మద్యం ద్వారా ఆదాయం పైనా రూ. 8300 కోట్లు తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం రూ. 71 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 90 వేలు వస్తోంది. డెవల్యూషన్ కింద కేంద్రం రూ. 35 వేల కోట్లు రాష్ట్రానికి ఇస్తోంది. 40 శాతం వడ్డీలకే కడుతున్నారు. అనధికార అప్పులే రూ. 4 లక్షల కోట్లకు పైగా ఉంది. అనధికార అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. బడుగులకు న్యాయం చేసేందుకే అప్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. ఏం చేశారు..? ఆస్తులను సృష్టించాల్సిన ప్రభుత్వం.. ఉన్న ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తెచ్చుకుంటోంది. భూములు తనఖా పెట్టి వచ్చిన రుణంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేస్తారా..? చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.” అని పురంధేశ్వరి ఆరోపించారు.
Also Read: CM KCR: మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ఫోకస్.. వచ్చే నెల 1న పర్యటన
జనసేన బీజేపీకి మిత్రపక్షమన్న పురంధేశ్వరి.. త్వరలో పవన్‌తో భేటీ అవుతామన్నారు. ఇప్పటికే పవన్.. నాదెండ్ల మనోహర్‌తో ఫోన్లో మాట్లాడామన్నారు. అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు తనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారన్నారు. ఏపీలో ఉన్నన్ని కోర్టు ధిక్కార కేసులు మరే ఇతర రాష్ట్రంలోనూ లేవన్నారు. ఆర్థికపరమైన వ్యవహరాల్లో కేంద్రం ఏపీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందన్నారు. ఏపీలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు మేం చేయమన్నారు.