ఫామ్ లేమితో ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) చేశాడు. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా.. ఆచితూచి ఆడి వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేశాడు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. విరాట్ శతకం బాదడంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు. కింగ్ సెంచరీపై అతడి సతీమణి అనుష్క శర్మ కూడా ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Virat Kohli: 36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరం: విరాట్
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను అనుష్క శర్మ ఇంటి నుంచే వీక్షించారు. టీవీలో విరాట్ కోహ్లీ సెంచరీ సంబరాలను ఫొటో తీసి.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. లవ్, హైఫై ఎమోజీలను జత చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం అనుష్క పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు సెంచరీ అనంతరం మైదానంలో విరాట్ తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్‌ను ముద్దాడాడు. అనుష్కకు సందేశమిచ్చేలా ఇలా చేశాడు. ఈ సెంచరీతో 14,000 వన్డే పరుగులను కోహ్లీ పూర్తి చేశాడు. 299 వన్డేల్లో కోహ్లీ 58.20 సగటుతో 14,085 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి.