Tiruvuru MLA: ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ సమయంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకు మొగ్గు చూపుతున్నారు. తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణనిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పేసినట్లు సమాచారం. తిరువూరు నుంచి రెండు సార్లు విజయం సాధించిన తనకు టికెట్ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణ నిధి ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. పార్టీలోనే ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలను రక్షణనిధి వద్దకు పంపినట్లు తెలిసింది. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు జరిపినప్పటికీ…రక్షణనిధి మాత్రం పార్టీలో కొనసాగేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలంటే తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని, లేదంటే మరోపార్టీ చూసుకుంటానంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం.
Read Also: Manickam Tagore: కేంద్రంలో కాంగ్రెస్ ఆధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా..
ఇదిలా ఉండగా.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధికి సీఎంవో నుంచి ఫోన్ కూడా వెళ్లింది. ఈ క్రమంలో ఫోన్‌కు కూడా రక్షణనిధి స్పందించలేదని సమాచారం. ఆయనను సీఎంవోకు రావాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ బుధవారం కోరారు. అయినా సీఎంవోకు వెళ్లడానికి రక్షణనిధి నిరాకరించారు. తాజా పరిణామాలతో రక్షణ నిధి పార్టీ వీడటం ఖాయమని ఆయన వర్గం చెబుతోంది. మరో వైపు ఎమ్మెల్యేకు సీటు లేదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని కేడర్ చెబుతోంది. పార్టీ మార్పుపై రక్షణ నిధి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.