రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని పరామర్శించాం. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అప్పటికప్పుడే ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తిరుపతిలో టీటీడీకి సంబంధించి పర్యవేక్షణ చేయాల్సిన సంయుక్త కార్య నిర్వహణ అధికారి గౌతమి సక్రమంగా విధులు నిర్వహించలేదు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో జేఈవోను ప్రశ్నించారు. దర్శన టోకెన్ల కౌంటర్లను సక్రమంగా పర్యవేక్షించలేదు. కౌంటర్ల వద్ద ఇంచార్జ్ గా ఉన్న పోలీస్ అధికారి కూడా విధుల్లో లేరు. అందువల్లే కొందరు అధికారులను బదిలీ చేయడంతో పాటు ఇద్దరిని సస్పెండ్ చేశారు.వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లను తిరుమల నుంచి కిందికి ఎందుకు మార్చారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Canada New PM: మార్చ్ 9న కెనడాకు కొత్త ప్రధాని
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి ఆనం తెలిపారు. “రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ బాధితులను పరామర్శించేందుకు తిరుపతికి వచ్చారు. ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారని.. ఆయన వెళ్లిన తర్వాత రమ్మని జగన్ కు అధికారులు సూచించారు. కానీ జగన్ అహంకారాన్ని ప్రదర్శిస్తూ… పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి వందలాది మంది ఆసుపత్రిలోకి వచ్చారు. ఐసీయూ రూములలోకి వెళ్ళవద్దని డాక్టర్లు వారిస్తున్నా వాళ్ళని పట్టించుకోలేదు. ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కు ఐసీయూ ప్రోటోకాల్ గురించి తెలియదా?
చెప్పిన సమయం కంటే జగన్ ఆలస్యంగా వచ్చారు. అయినా అధికారులు ఆయనకు సహకరించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. పేషెంట్ లకు పెట్టిన సెలైన్ బాటిళ్లను కూడా తోసేశారు. ఇలా వ్యవహరించడం సరికాదు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.