Hero Allu Arjun: ఏఆర్ మురుగదాస్ పేరు వినగానే తను దర్శకత్వం వహించిన ‘గజనీ’, ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘సర్కార్’ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగులో తను డైరెక్ట్ చేసింది ఒకే ఒక సినిమా అయినా తను దర్శకత్వం వహించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవటమే, డబ్ అవటమే జరిగాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌తో మురుగదాస్ ఓ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని వినిపించింది. అయితే ఆ సినిమాను తెలుగులో చరణ్‌తో చేస్తూ ఒకేసారి తమిళంలో శింబుతో కూడా చేయాలనుకున్నాడు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ప్రకటించటంతో ఆ ఐడియా చరణ్‌కి నచ్చలేదని అర్ధం అయింది. దాంతో మురుగదాస్ అల్లు అర్జున్‌ని సంప్రదించాడట.
కథను విన్న అల్లు అర్జున్ నచ్చిందని చెబుతూ వేరే భాషలో వేరే హీరోతో సినిమా చేయలేనని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందే కథతో వస్తే చేయటానికి సిద్ధమేనని బన్నీ మురుగదాస్‌కి తెలియచేశాడట. గతంలో ఇదే తరహా ఆఫర్ లింగుస్వామికి ఇచ్చినప్పటికీ అల్లుఅర్జున్ ను మెప్పించే కథను లింగుస్వామి రెడీ చేయలేక పోయాడు. అప్పట్లో లింగుస్వామి చెప్పగా అల్లు అర్జున్ తిరస్కరించిన కథ రామ్ పోతినేని హీరోగా ‘ది వారియర్’ పేరుతో తెరకెక్కింది. ఫలితం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మురుగదాస్ బన్నీ సూచన మేరకు ఫ్రెష్ స్క్రిప్ట్‌తో వస్తాడో లేక తమిళంలో శింబు చేయబోయే చిత్రానికి తెలుగులో హీరోని వెతుక్కుని సర్దుకు పోతాడో చూడాలి.