Akhilesh Yadav: 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని విపక్ష పార్టీ ఒక్కతాటిపై నిలిచి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ఏర్పాటు చేసినంత ఈజీగా లెక్కలు తేలడం లేదు. దేశంలోని కీలక విపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ.. ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కాంగ్రెస్ పార్టీనే ముఖ్య కారణమని తెలుస్తోంది.
Also Read: Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..
త్వరలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందులో మధ్యప్రదేశ్ కూడా ఉంది. సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోనూ కాస్త పలుకుబడి ఉంది. ఈ నేపథ్యంలో.. తాము బలంగా ఉన్న స్థానాల్లో బరిలో దిగుతామని, కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఆ మాటలను కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఫలితంగా.. ఇప్పుడు.. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిపై ఒకరు అభ్యర్థులను దింపుకున్న పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలో సమాజ్‌వాదీ పార్టీ విఫలమవడంతో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌పై తన మాటల దాడిని కొనసాగించారు. కాంగ్రెస్‌ను ద్రోహమని బహిరంగంగా విమర్శించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత.. ఈ గందరగోళం కొనసాగితే ఇండియా కూటమి బీజేపీని ఎప్పటికీ ఓడించలేదని అన్నారు.
“కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో సీట్లు ఇవ్వకూడదనుకుంటే ముందే చెప్పాల్సింది.. ఈరోజు ఎస్పీ తన సొంత పార్టీ ఉన్న సీట్లపైనే పోరాడుతోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌తో మాట్లాడాను. మధ్యప్రదేశ్‌లో పార్టీ బలం గురించి వివరించాను. గతంలో మా ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారు? ఎక్కడ నెంబర్.2గా నిలిచారో చెప్పాను. మాకు 6 సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇక అభ్యర్థులను ప్రకటించినప్పుడు ఎస్పీ ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో కూటమి లేదని నాకు ముందే తెలిస్తే.. అసలు కలిసేవాడినే కాదు కదా! కాంగ్రెస్‌తో మాట్లాడే వాడినే కాదు కదా!. జాతీయ స్థాయిలో జరిగే (పార్లమెంటరీ) ఎన్నికల కోసం.. కాంగ్రెస్ ఇలాగే కొనసాగితే, వారితో ఎవరు నిలబడతారు?. మన మనస్సులో గందరగోళంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే విజయం సాధించలేము.” అని అఖిలేష్ యాదవ్ అన్నారు.
Also Read: Karnataka: ఇంట్లో గొడవలు.. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఇండియా కూటమి ఏర్పడినప్పటికీ, ఎస్పీ వ్యూహం PDA (పిచాడ, దళిత, అల్పసంఖ్యక్) కోసం పనిచేయడంపై ఆధారపడి ఉంటుందని ఎస్పీ చీఫ్ చెప్పారు. “మొదట PDA ఏర్పడింది. తర్వాత ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి ఉన్నప్పటికీ మా వ్యూహం పీడీఏనేనని.. PDA NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్)ని ఓడించగలదని నేను చాలా సందర్భాలలో చెప్పాను.” ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. షాజహాన్‌పూర్‌లో జరిగిన ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ హాజరవుతూ.. బీజేపీ నుంచి నుంచి భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సవాళ్లు, కుట్రల గురించి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించడానికి అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి, భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు, కుట్రలు ఎదుర్కోవాల్సి ఉంటుందో, ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ ఎలా దుర్వినియోగం చేస్తుందో పార్టీ కార్యకర్తలకు తెలియజేయాలి. దుష్ప్రచారాన్ని అడ్డుకుని, సత్యాలను ప్రచారం చేయాలి.” అని కార్యకర్తలకు అఖిలేష్ యాదవ్ సూచించారు. ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఇండియా కూటమి భవిష్యత్తు అయోమయంలో పడినట్లే కనిపిస్తోంది.