Maharashtra NCP Chief: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్‌గా లోక్‌సభ ఎంపీ సునీల్ తట్కరేను అజిత్ పవార్ వర్గం సోమవారం నియమించింది. విలేఖరుల సమావేశంలో ఎన్‌సీపీ తిరుగుబాటు వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. జయంత్ పాటిల్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి, సునీల్ తట్కరేను రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించారని తెలిపారు. జయంత్ పాటిల్ వెంటనే సునీల్ తట్కరేకు బాధ్యతలు అప్పగించాలని, మహారాష్ట్ర నుంచి అన్ని నిర్ణయాలను పూర్తిగా సునీల్ తట్కరే తీసుకుంటారని ప్రఫుల్ పటేల్ అన్నారు. అధికారికంగా సునీల్ తట్కరే మహారాష్ట్రకు ఇంఛార్జ్‌గా ఉంటారని , ఇకపై అన్ని నియామకాలు, నిర్ణయాలను సునీల్ తట్కరీ తీసుకుంటారన్నారు.
Also Read: NCP: అజిత్ పవార్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు.. ముగ్గురిని తొలగించిన ఎన్సీపీ
మహారాష్ట్రలో ఎన్సీపీని బలోపేతం చేసేందుకే రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లు సునీల్ తట్కరే ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ నాయకులందరి మద్దతు పొందానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అందరు ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ నాయకుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఇదిలావుండగా, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చేరిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎంపీలు సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్‌లపై అనర్హత వేటు వేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కోరారు.