Wife Harassment: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో తరచూ దురుసుగా ప్రవర్తించేదని, ఇదివరకూ కూడా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. కానీ భార్య వల్ల తాను మరింత మానసిక క్షోభకు గురై చివరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Read Also: Sam Pitroda: కేంద్రానికి శామ్ పిట్రోడా కౌంటర్.. ఆ ప్రకటనను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత
6 నిమిషాల 57 సెకండ్ల వీడియోలో మానవ్ తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి, “పాపా, మమ్మీ, అక్కూ, సారీ… ఇక నేను వెళ్లిపోతున్నా” అని అన్నారు. అలాగే, సమాజంలో పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. పురుషులు కూడా చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తారు, దయచేసి ఎవరో ఒకరు మగవారి గురించి కూడా మాట్లాడాలని మానవ్ వేదనతో పేర్కొన్నారు. చివర్లో, తాను ఉరికి బిగించుకుంటూ ఆత్మహత్య చేసుకున్నారు.
మానవ్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కొడుకు గత ఏడాది వివాహం చేసుకున్నారని తెలిపారు. పెళ్లి తర్వాత ఉద్యోగరీత్యా మానవ్ తన భార్యను ముంబైకి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆమె తరచూ గొడవలు పడేవారని, కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు బెదిరించేదని తెలిపాడు. అంతేకాకుండా, ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానం ఉన్నట్లు తండ్రి ఆరోపించారు. ఫిబ్రవరి చివర్లో, మానవ్ తన భార్యను తీసుకుని ఆగ్రాకు తిరిగి వచ్చారు. అయితే కొద్ది రోజులకే భార్య తన పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిపారు. మానవ్ తండ్రి మాట్లాడుతూ.. తమ కోడలు కుటుంబ సభ్యులతో కలిసి తన కుమారుడిని బెదిరించారని, దీంతో మానవ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
Read Also: SLBC Tunnel Collapse: భయంగా ఉంది.. సొంతూర్లకి ఎస్‌ఎల్‌బీసీ కార్మికులు!
ఈ ఘటన బెంగళూరులో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెచ్చింది. అతుల్ కూడా తన భార్య వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనల్లోనూ బాధితులు తమ భార్యలపై మానసిక, భావోద్వేగ వేధింపుల ఆరోపణలు చేశారు. మానవ్ శర్మ కేసులో పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. మానవ్ భార్య, ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. మానవ్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోను కూడా పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు పురోగతిపై మరింత సమాచారం త్వరలో వెలుబడనుంది.