శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ కార్మికులు సొంతూర్లకి పయనమవుతున్నారు. ఇటీవలి రోజుల్లో టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకోవడంతో తమ కుటుంబ సభ్యులు భయపడుతున్నారని అధికారులకు కార్మికులు చెబుతున్నారు. టన్నెల్‌లో పని చేయాలంటే భయంగా ఉందని, పనులు ముందుకు సాగుతాయో లేదో అని కార్మికులు అంటున్నారు. జార్ఖండ్, బీహార్, యూపీ, హర్యానాలకు కొందరు ఎస్‌ఎల్‌బీసీ కార్మికులు బయల్దేరారు.
ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దాదాపుగా 150 గంటలుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలను వేగవంతం చేశారు. బీఆర్‌వో, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ, ఆర్మీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, హైడ్రా, పలు ప్రైవేటు నిర్మాణ సంస్థలు రెస్క్యూ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. సొరంగంలో సుమారు 200 అడుగుల మేర పేరుకుపోయిన బురద, టీబీఎం శిథిలాలను తొలగిస్తున్నారు. రెండు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.