Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కథువా జిల్లాలోని తన పాఠశాలలో ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని 3వ తరగతి విద్యార్థిని వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరిన కొన్ని రోజుల తర్వాత.. జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ దానికి కొత్త రూపాన్ని ఇచ్చే పనిని ప్రారంభించింది. గత వారం ప్రధానమంత్రికి సీరత్ నాజ్ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో జమ్మూలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ ఆ పాఠశాలను సందర్శించారు.
‘మా స్కూల్ ను బాగు చేయండి’ అంటూ ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలపై సౌకర్యాలపై ఏకరువు పెడుతూ జమ్మూకు చెందిన చిన్నారి సీరత్ నాజ్ ప్రధాని నరేంద్ర మోడీకి వీడియో సందేశాన్ని పంపింది. తన స్కూల్ దుస్థితిని ఆ వీడియోలో వివరిస్తూ.. మా కోసం మంచి స్కూల్ బిల్డింగ్ కట్టించాలని ప్రధానిని బాలిక కోరింది. దేశం మొత్తం చెప్పింది వినాలని, నా మొర కూడా ఆలకించాలని ఆ పసిపాప విజ్ఞప్తి చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ వీడియోను ఒకరు తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. 2 మిలియన్లకుపైగా వ్యూస్, దాదాపు 1.20 లక్షల లైక్‌లు వచ్చాయి. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి.
ఆ వీడియోలో పాఠశాల శిథిలావస్థ గురించి నాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మురికి నేలపై కూర్చోవలసి వస్తుంది, దీని వల్ల వారి యూనిఫామ్‌లకు మరకలు అవుతున్నాయి. మరుగుదొడ్ల దుస్థితి, బహిరంగ మలవిసర్జన సమస్యలు, భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆ చిన్నారి వివరించింది. “మోడీజీ.. మీరు మొత్తం దేశం చెప్పేది వినండి, దయచేసి నా మాట కూడా వినండి. మా కోసం ఒక మంచి పాఠశాలను నిర్మించండి, తద్వారా మేము మా విద్యను కొనసాగించగలము. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. దీంతో అమ్మలు తరచూ మమ్మల్ని తిడుతున్నారు. ఏం చేస్తాం.. ఇక్కడ మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు.” అని బాలిక తన ఉద్వేగభరితమైన విజ్ఞప్తిలో పేర్కొంది.
Read Also: Triangle Love : ఒకే అమ్మాయిని ఇద్దరూ లవ్ చేశారు.. లాస్ట్‌లో ట్విస్ట్ మామూలుగా లేదు
వీడియో క్లిప్‌ను గమనించిన జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే పాఠశాలకు కొత్త రూపాన్ని అందించడానికి చర్యలు చేపట్టింది. “పాఠశాలను ఆధునిక పద్ధతిలో అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 91 లక్షల విలువైన ప్రాజెక్ట్ మంజూరు చేయబడింది. అయితే పరిపాలనా ఆమోదానికి సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు అది పరిష్కరించబడింది. పనులు జరుగుతున్నాయి” అని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ పాఠశాలను సందర్శించిన తర్వాత చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో వందలాది పాఠశాలలు నడుస్తున్నాయని, ఈ పాఠశాలలన్నింటిలో సరైన, ఆధునిక సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం ఇప్పటికే ఒక వివరణాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందించిందని అధికారి తెలిపారు. జమ్మూ ప్రావిన్స్‌లోని అన్ని జిల్లాల్లో 1,000 కొత్త కిండర్ గార్టెన్‌లను నిర్మించడం ప్రారంభించాము. రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో ప్రతి 10 జిల్లాలో (జమ్మూ ప్రావిన్స్‌లో) 250 కిండర్ గార్టెన్‌ల నిర్మాణాలను పూర్తి చేస్తాం”అని ఆయన చెప్పారు.
ఐఏఎస్ కావాలని ఆకాంక్షిస్తున్న చిన్నారి సీరత్ నాజ్.. తన సందేశానికి సానుకూల స్పందన లభించినందుకు సంతోషంగా ఉంది. “మన ప్రధాన మంత్రితో నా ఆలోచనలను పంచుకోవడానికి నేనే ఈ వీడియోను రూపొందించాను. చర్య తీసుకున్నందుకు, మా పాఠశాల కొత్త రూపాన్ని పొందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని ఆమె చెప్పింది. గ్రామస్థులు కూడా పాఠశాల పునరుద్ధరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల మాదిరిగా దీనిని ఆధునిక మార్గాల్లో అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.