Abhishekam: కూరల్లో కారం కొంచెం ఎక్కువైనా.. చేతికి గాయం అయితే.. దానికి కారం తగిలినా అల్లాడిపోతాం.. అలాంటిది ఓ స్వామీజికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 60 కేజీల కారంతో అభిషేకం చేశారు. మీరు చదివింది నిజమే.. అచ్చమైన కారంతోనే అభిషేకం. పూలతోనో, పాలతోనో, పంచామృతాలతోనో అభిషేకం అన్ని చోట్లా జరిగేదే.. కానీ ఇక్కడ కారాభిషేకానికి ఓ ప్రత్యేకత ఉందండోయ్.. మొదట స్వామిజీకి స్నానం చేయిస్తారు. పూనకంతో ఉన్న ఆ స్వామికి దూపం వేసి కూర్చోబెడతారు..ఆ తరువాత అసలు తతంగం మొదలవుతుంది. ప్రత్యంగిరా మాత ఆవాహనతో శివస్వామి ఉన్నప్పుడు.. భక్తులు ఆయనకు ఇలా కారంతో అభిషేకం చేశారు. ఓం నమశ్శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ స్వామి శరీరంపై కారం చల్లారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీశివ దత్త ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ఈ అభిషేకం జరిగింది. కారంతో శరీరానికి నలుగు పెట్టినట్లుగా అభిషేకం చేయడంతో దానిని చూడటానికి చుట్టుపక్కల గ్రామస్తులు తరలివచ్చారు.
Read Also: Caste Boycott: ఎంత అమానుషం!.. తిరునాళ్లకు చందాలు ఇవ్వలేదని కుల బహిష్కరణ
ప్రత్యంగిరి దేవి ఆరాధకులు శివునికి ఎర్ర కారంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజలో భాగంగా ముందుగా శివ స్వామి ప్రత్యంగిరి దేవి పూర్ణాహుతి హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యంగరాదేవిని ఆవాహన చేసి దీపోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు శివస్వామికి మిరియాలతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ప్రత్యంగిరా దేవికి చాలా ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. హిరణ్యకసిపుడిని నరసింహస్వామి వధించిన తర్వాత ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ఈ ప్రత్యంగిరాదేవి ఉద్భవించారని పురాణాల్లో ఉంది. ఈ పూజల్లో ఎండు మిరపకాయలు, కారం లాంటివి ఉపయోగిస్తారు. ఇలా కారంతో అభిషేకం చేస్తే దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆ ప్రత్యంగిరీ దేవికి ఎండు మిరపకాయలు అంటే చాలా ఇష్టం అట. అందుకే ఆమె మెడలో ఎండు మిరపకాయలతో చేసిన హారాన్ని వేస్తారు. . ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న పరమశివునికి ఇలా ఎర్ర మిరపకాయలు కారంగా చేసి అభిషేకం చేస్తే జీవిత బాధలు, కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. కార్తీక మాసంలో ఇలా కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉండగా.. భక్తులు కారం అభిషేకం చేస్తున్న సమయంలో స్వామిజీ కదలడు, మెదలడు. ఉలకడు.. పలకడు. అభిషేకం నిర్వహించినంత సేపు భక్తులు తన్మయత్వంతో పరవశించిపోతారు. అంతా దేవుడి మహిమ అంటారు.