Caste Boycott: గుడి తిరునాళ్లకు చందాలు ఇవ్వలేదని 17 కుటుంబాలను కుల బహిష్కరణతో పాటు గ్రామం నుంచి బహిష్కరించిన అమానుష ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలోని అరుంధతి నగర్‌లో చోటుచేసుకుంది. శానంపూడిలో మాతమ్మ గుడి తిరునాళ్లకు చందాలు ఇవ్వలేదంటూ 17 కుటుంబాలను కాలనీ పెద్దలు బహిష్కరించారు. ఆ కుటుంబాల వారితో ఎవరైనా మాట్లాడితే 10 వేలు జరిమానా కట్టాలని దండోరా వేయించారు కాలనీ పెద్దలు.
Read Also: Pakadwa Vivah: గన్ చూపించి టీచర్ కిడ్నాప్.. కిడ్నాపర్ కూతురితో బలవంతంగా పెళ్లి..
అరుంధతి నగర్‌లో రెండు నెలల క్రితం జరిగిన మాతమ్మ గుడి తిరునాళ్లకు అందరూ చందాలు ఇవ్వాలని కాలనీ పెద్దలు తీర్మానించారు. తాము చర్చికి వెళ్తున్నందున చందాలు ఇచ్చేది లేదని కొన్ని కుటుంబాలు తేల్చి చెప్పాయి. తిరునాళ్ల తర్వాత కాలనీలోని 40 కుటుంబాలకు గానూ 17 కుటుంబాలు చందాలు ఇవ్వలేదని కాలనీ పెద్దలు తేల్చారు. ఆగ్రహించి 17 కుటుంబాలను కుల బహిష్కరణతో పాటు గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు చాటింపు వేయించారు కాలనీ పెద్దలు. ఆ కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 10 వేల జరిమానా కట్టాలని డప్పు కొట్టి చాటింపు వేయించారు.
తహశీల్దార్ కార్యాలయంలో బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. చర్చికి వెళ్లే తాము గుడికి డబ్బులు కట్టలేదని ఇబ్బంది పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాయి ఆ కుటుంబాలు. సమస్యను పరిష్కరించాలని బహిష్కరణకు గురైన కాలనీ వాసులు కోరుతున్నారు.