ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుస్తుందని మిస్టర్ 360, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. క్వాలిఫయర్-1లో తేలిపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. జోష్ హేజిల్‌వుడ్ రాకతో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ బలంగా మారిందన్నాడు. భువనేశ్వర్ కుమార్ టోర్నీలో చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని ఏబీడీ తెలిపాడు. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక జూన్ 3న ఫైనల్ కోసం ఆతృతగా వేచి చూస్తోంది.
జియో హాట్‌స్టార్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ… ‘క్వాలిఫయర్-1లో విరాట్ కోహ్లీ పెద్దగా పరుగులు చేయలేదు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభంలో మొదటిసారి స్క్రీన్ మీద చూసినప్పుడు అతడిలో ఏకాగ్రతను చూశాను. ఒక్కోసారి త్వరగా పెవిలియన్ చేరుతారు. అయినా ఇబ్బందేమీ లేదు. కోహ్లీ కచ్చితంగా ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడతాడు. ఇందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ ఆడుతుంటే చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పాడు. ఐపీఎల్ 2025 ఆరంభం నుంచి కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. ఇప్పటికే 600 పరుగుల మార్క్ అందుకున్నాడు. క్వాలిఫయర్-1లో 12 పరుగులే చేసిన కింగ్.. ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: GT vs MI: ఎలిమినేటర్ మ్యాచ్ రద్దైతే.. క్వాలిఫయర్ 2కు ఏ టీమ్ వెళుతుందంటే?
‘2011లో ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు మంచి అవకాశం ఉండేది. అందరూ 2016 గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతాన్ని మరిచిపోవాలి. ప్రస్తుతం ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ టైటిల్‌ను గెలిచేందుకు చాలా చేరువలో ఉంది. ఇంకా ఒక్క మ్యాచే. జూన్ 3న జరగనున్న ఫైనల్లో ఆర్సీబీ తప్పకుండా విజయం సాధిస్తుంది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ రాకతో బెంగళూరు బౌలింగ్ యూనిట్ బలంగా మారింది. భువనేశ్వర్ కుమార్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ బౌలింగ్, బ్యాటింగ్ సమతూకంగా ఉంది’ అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.