హిమాచల్ ప్రదేశ్‌లో డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను పెంచింది. దీంతో వాహనదారుల జేబులకు మునుపటి కంటే ఎక్కువ భారం పడనుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో డీజిల్ ధర.. అనేక రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచింది. డీజిల్‌పై మొత్తం వ్యాట్ రికవరీ లీటరుకు రూ.10.40కి పెరిగింది. గతంలో డీజిల్‌పై 9.90 శాతం ఉన్న వ్యాట్ ఇప్పుడు 13.9 శాతానికి చేరుకోనుంది.
ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ మరియు పన్నుల శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వ్యాట్ పెంపును వివరించిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు.. ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం డీజిల్‌పై వ్యాట్‌ను 7 శాతానికి తగ్గించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాట్ పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసరంగా మారిందని పేర్కొన్నారు. ఈ వ్యాట్‌ను పెంచినప్పటికీ.. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో డీజిల్ ధర తక్కువగా ఉందని సుఖ్వీందర్ సింగ్ సిఖు తెలిపారు.
Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లో కొలువైన బద్రీనాథుడు.. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మీకు తెలుసా?
మరోవైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రం చాలా నష్టపోయిందని.. అటువంటి పరిస్థితిలో వనరుల కొరతను తీర్చడానికి, రహదారి, నీటి సరఫరా మరియు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమని సుఖ్వీందర్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల వల్ల ఏర్పడిన నష్టానికి శాశ్వత పరిష్కారం లభించేందుకు ఏడాది పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. అయితే ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం డీజిల్ ధరను పెంచడంపై ప్రతిపక్ష నేత జై రామ్ ఠాకూర్ మండిపడుతున్నారు.