తెలంగాణ వ్యాప్తంగా కండ్ల కలకలు వ్యాప్తి చెందుతున్నాయి. వైద్యాధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కండ్ల కలకలు వచ్చిన వారు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసింది. కండ్ల కలకలు వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.. అయినా.. పలు చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో ఈ వ్యాధి బారిన పడిన వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల (గన్నెరువరం)లో 60 విద్యార్ధులకు కండ్ల కలకలతో ఇబ్బందులు పడుతున్న.. వారికి చికిత్స చేసేందుకు వైద్యాధికారులు రాలేదు.
Read Also: Snake: స్టేడియంలోకి స్నేక్ ఎంట్రీ.. మ్యాచ్కు అంతరాయం
ఈ పాఠశాలలో 570 మంది విద్యార్థులు ఉండగా.. గత వారం రోజుల నుంచి 60 మంది స్టూడెంట్స్ కండ్ల కలకతో ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ సూపర్వైజర్ లేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 9వ తరగతికి చెందిన అక్షయ్ అనే విద్యార్థితో డ్రాప్స్ ఇప్పించి ఉపాధ్యాయులు చికిత్స చేయించారు. విద్యార్థులు వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా..హెల్త్ కు సంబంధించిన వైద్యులు, విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. కండ్ల కలకలతో ఒక విద్యార్థి నుంచి మరో విద్యార్థికి సోకుతుందని పాఠశాల ఉపాధ్యాయలకు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. దీంతో పిల్లలకు కండ్ల కలకలు అయినట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో.. వారు తమ పిల్లలను ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు.