Abhilasha Movie: నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు. అలా చిరంజీవిని నవలా నాయకునిగా నిలిపిన చిత్రాలలో మొదటిది ‘అభిలాష’ అనే చెప్పాలి. ఈ సినిమాకు ముందు కూడా చిరంజీవి “చండీప్రియ, న్యాయం కావాలి” వంటి నవలా చిత్రాల్లో నటించినప్పటికీ, కథను తన భుజాలపై వేసుకుని వెళ్ళే కథానాయకుని పాత్రలు వాటిలో పోషించలేదు. అందువల్ల ‘అభిలాష’తోనే చిరంజీవికి నవలానాయకుడు అన్న పేరు లభించిందనవచ్చు. ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ సీరియల్ గా యండమూరి వీరేంద్రనాథ్ కలం నుండి జాలువారిన ‘అభిలాష’ ఆ రోజుల్లో పాఠకులను విశేషంగా అలరించింది. నవలా రూపంలోనూ ‘అభిలాష’ జనాన్ని ఎంతగానో మురిపించింది. ఆ కథతో రూపొందిన ‘అభిలాష’ చిత్రంతోనే కె.యస్.రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ నిర్మించడం విశేషం! రాధిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1983 మార్చి 11న విడుదలైన ‘అభిలాష’ సినిమా సైతం మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ కు ఇళయరాజా బాణీలు కూడా తోడయ్యాయి. ఈ చిత్రం తరువాత చిరంజీవి, కోదండరామిరెడ్డి, ఇళయరాజా, యండమూరి కాంబోలో కె.యస్.రామారావు నిర్మించిన నవలాచిత్రాలు మ్యూజికల్ హిట్స్ గానూ మురిపించాయి.
‘వందమంది నేరస్థులు తప్పించుకోవచ్చు కానీ, ఒక్క అమాయకునికి కూడా శిక్ష పడకూడదు’ అని ఏ నాటి నుంచో న్యాయనిపుణులు ఘోషిస్తున్నారు. కానీ, కొందరు అన్యాయంగా ఉరికంబం ఎక్కడం కూడా జరిగింది. అలా జరగకూడదనే ఉరిశిక్ష విధించే సెక్షన్ 302ను రద్దు చేయాలని మేధావి వర్గాలు ఎన్నో ఏళ్ళ నుండి పోరాటం చేస్తున్నాయి. అయితే అది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అది వేరేవిషయం! ‘అభిలాష’ కథ సెక్షన్ 302ను రద్దు చేయాలన్న అంశం చుట్టూ తిరుగుతూ రూపొందింది. మరో విశేషమేమిటంటే ఈ నవలలో హీరో పేరు కూడా చిరంజీవి కావడం. అదే పాత్రను చిరంజీవి పోషించడం!
Read Also: Naresh: నాకు ప్రైవసీ కావాలి.. పెళ్లిపై స్పందించిన నరేష్
‘అభిలాష’ కథ విషయానికి వస్తే- చిరంజీవి లాయర్. అంతగా కేసులు ఉండవు. ఏదో ఒకరోజున గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు అంతటివాడు కావాలని కలలు కంటూ ఉంటాడు. చిన్నతనంలో అతని తండ్రిని అన్యాయంగా ఉరి తీసి ఉంటారు. దాంతో చిరంజీవి ఉరిశిక్ష విధించే సెక్షన్ 302ను రద్దు చేయాలని, అందుకు చట్టాన్ని మార్చాలని తపిస్తూంటాడు. ఈ నేపథ్యంలో చిరంజీవికి తాను ఎంతగానో అభిమానించే సర్వోత్తమ రావు నుండి పార్టీకి పిలుపు వస్తుంది. ఆ పార్టీలో చిరంజీవి అనుకోకుండా సర్వోత్తమ రావు మేనకోడలు అర్చనను కలుసుకుంటాడు. అతని అమాయకత్వం, మంచితనం అర్చనకు నచ్చుతాయి. ఈ లోగా ఉరిశిక్షను రద్దు చేయాలన్న దానికి తన వద్ద ఓ ప్లాన్ ఉందని, దాని ప్రకారం చట్టాన్ని మార్చవచ్చునని సర్వోత్తమరావుతో చిరంజీవి అంటాడు. దానిలో భాగంలో ఓ ఫేక్ మర్డర్ ను ప్లాన్ చేస్తాడు. తానే చంపినట్టు చట్టానికి లొంగిపోతాడు. అనుకున్న ప్రకారం సర్వోత్తమ రావు వచ్చి, సాక్ష్యాలు చూపించి, చిరంజీవిని నిర్దోషి అని తేల్చి, మార్చండి మన చట్టాల్ని అని పిలుపునివ్వాలి. కానీ, అలా జరగదు. సర్వోత్తమరావు యాక్సిడెంట్ అయి ఆసుపత్రి పాలవుతాడు. చిరంజీవికి శిక్ష ఖాయమవుతుంది. అప్పుడు చిరంజీవి తాను నిర్దోషినని సెంట్రీ విష్ణుశర్మకు అసలు విషయం చెబుతాడు. అతను ఆ విషయాన్ని అర్చనకు చేరవేస్తాడు. వారిద్దరూ కలసి గవర్నర్ కు అసలు విషయం చెప్పి, అప్పటికి శిక్ష రద్దు అయ్యేలా చేస్తారు. తరువాత సర్వోత్తమ రావు కూడా ఆసుపత్రి నుండి వచ్చి, చిరంజీవి విడుదలయినందుకు పార్టీ ఇస్తాడు. ఆ సమయంలో చిరంజీవి వేసిన ప్లాన్ లో భాగంగా శవం ఇచ్చిన ఓబులేసు వస్తాడు.అతనితో చిరంజీవి మాట్లాడడం చూసిన అర్చనకు ఏదో అనుమానం కలుగుతుంది. తాను ఉరిశిక్ష రద్దు చేయాలి అన్న అంశం కోసం ఆడిన నాటకంలో నిజంగానే మర్డర్ కు గురయిన అమ్మాయి శవం ఉందన్న విషయం చిరంజీవికి తెలుస్తుంది. అతని చుట్టూ మళ్ళీ ఉచ్చు బిగించుకుంటుంది. అర్చన సైతం చిరంజీవిని అనుమానిస్తుంది. చివరకు ఆ ప్లాన్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటాడు. అది తాను ఎంతగానో అభిమానించే సర్వోత్తమరావు అని తెలిసి ఆశ్చర్యపోతాడు. అసలు శవంగా మారిన అమ్మాయి సర్వోత్తమరావు అక్రమ సంతానమని, అందువల్లే ఆమెను అతనే చంపించాడని తెలుస్తుంది. ఈ విషయాలు అర్చనకూ తెలుస్తాయి. సర్వోత్తమరావు అర్చనను, చిరంజీవిని మట్టుపెట్టాలనుకుంటాడు. కానీ, అతనే దొరికిపోతాడు. కోర్టులో సర్వోత్తమరావుకు శిక్ష పడాలని వాదిస్తాడు చిరంజీవి. చివరలో ఉరిశిక్ష ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించి, అతనిలో మార్పు వచ్చేలా చేయాలని చిరంజీవి అభిలషిస్తాడు. “ఏ ప్రెసిడెంటు, ఏ ప్రైమ్మినిస్టర్ ఉండగా ఈ ఊరిశిక్ష రద్దవుతుందో వారికి ఈ చిత్రం అంకితం” అంటూ ఎండ్ కార్డ్ వేస్తారు.
Read Also: NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
‘అభిలాష’లో రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, రాళ్ళపల్లి, భీమరాజు, ఉయ్యూరు రామకృష్ణ, మాడా, సియస్ రావు, సత్యేంద్రకుమార్, పి.జె.శర్మ, విజయరామ్, కృష్ణచైతన్య, ధమ్, మల్లికార్జునరావు, అతిథి పాత్రలో రాజ్యలక్ష్మి నటించారు. యండమూరి వీరేంద్ర నాథ్ కథ రాసిన ఈ చిత్రానికి మూలకథను ఓఎస్.ఆర్.మూర్తి అందించారు. ఈ సినిమాకు జి.సత్యమూర్తితో కలసి కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే రాయగా, సత్యానంద్ తో కలసి యండమూరి సంభాషణలు పలికించారు. ఇళయరాజా స్వరకల్పన చేశారు. ఇందులోని “ఉరకలై గోదావరి…”, “వేళా పాల లేదు…” అంటూ సాగే పాటలను ఆత్రేయ రాయగా, “నవ్వింది మల్లె చెండు…”, “బంతీ చామంతీ…”, “సందెపొద్దుల కాడ…” అంటూ సాగిన గీతాలను వేటూరి పలికించారు.
సాధారణంగా చిత్రాల్లో అందరికంటే చివరగా దర్శకుని పేరు టైటిల్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని ఎ.కోదండరామిరెడ్డి కూడా అనుసరించేవారు. కానీ, ఈ సినిమాలో ‘అభిలాష’ టైటిల్ కాగానే డైరెక్టర్ పేరును ముందుగా ప్రకటించారు. తరువాతే చిరంజీవి పేరు రావడం గమనార్హం! ఈ సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా పాఠకులైన సినీ ఫ్యాన్స్ ను విశేషంగా మురిపించింది. ఇళయరాజా పాటల కోసం పదే పదే ఈ సినిమాను చూశారు జనం. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంది. పాటల్లో ఆయన డాన్సులు ప్రేక్షకులను కట్టిపడేశాయి. చిరంజీవి, రాధిక జంట మరోమారు ఈ సినిమాతో పులకింప చేసింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘సట్టతై తిరుతుంగల్’ పేరుతో రీమేక్ చేశారు. యండమూరి నవల రాకముందే, 1946 రూపొందిన ‘ద మేన్ హూ డేర్డ్’, 1956లో తెరకెక్కిన ‘బియాండ్ ఏ రీజనబుల్ డౌట్’ సినిమాలు ఇదే పాయింట్ తో రూపొందడం గమనార్హం!