Manjeera Kumbh Mela: మన దేశంలో నదులను కూడా దేవతలుగా పూజిస్తారు. అందుకే పన్నెండేళ్ల కోసారి పుష్కరాల పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించి.. నదీమ తల్లిని పూజిస్తారు. పుష్కరాలతో పాటు కుంభమేళాను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా కుంభమేళా సోమవారం ప్రారంభమైంది. న్యాల్‌కల్ మండలం రాఘవాపూర్-చాల్కి గ్రామాల మధ్య మంజీరా నది ఒడ్డున 12 రోజులపాటు నిర్వహించే మంజీరా (గరుడగంగ) కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ, పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంజీర నదికి చేరుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, జిల్లా సహకార, మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పంచవటి పీఠాధిపతి కాశీనాథ బాబా పూజలు నిర్వహించారు. బోనాలు తలపై పెట్టుకుని మహిళలు తరలివస్తుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేళల్లో పూజారులు మంజీర నదికి గంగా హారతి నిర్వహించారు. 12 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో మొదటి రోజున మంచి సంఖ్యలో నాగ సాధువులు పూజల్లో పాల్గొన్నారు.
Read Also: PM Modi: కేరళలో తొలి వందే భారత్.. నేడు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోడీ
మంజీరా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా ప్రవహించి గౌడ్‌గావ్ వద్ద తెలంగాణలోకి ప్రవేశించి ప్రవహిస్తుంది. మంజీరా నదికి దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా 2010లో పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహించారు. ఆ తర్వాత 2013, 2018లో కుంభమేళా ఘనంగా జరిగింది. ఈసారి మళ్లీ.. ఏప్రిల్ 24 నుంచి మే 5వ తేదీ వరకు నాలుగో సారి మళ్లీ కుంభమేళా నిర్వహించనున్నారు. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రాఘవాపూర్ పంచవటి క్షేత్రంలో మంజీరా కుంభమేళాను ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేళాకు నాగసాధువులు, సాధుసంతులు, భక్తులకు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రత్యేక షెడ్లు సిద్ధం చేశారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.