10th Results : హైదరాబాద్ నగరంలోని అల్వాల్, వెస్ట్ వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల్లో విఫలమవుతాననే భయం ఓ లేత ప్రాణాన్ని బలితీసుకుంది. వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న సంజయ్ కుమార్ (15), ఫలితాల వెల్లడికి ముందే తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగియడంతో సంజయ్ సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే, మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయనే వార్త అతని మనసులో భయాన్ని నింపింది. స్నేహితులు చెప్పిన మాటలు మరింత కలవరపెట్టడంతో, పరీక్షల్లో తప్పకుండా ఫెయిల్ అవుతాననే నిర్ణయానికి వచ్చేశాడు. ఈ భయంతోనే ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని తన జీవితాన్ని ముగించాడు.
చిన్న వయసులోనే సంజయ్ తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మార్కులు, ఫలితాలు కేవలం ఒక అంచనా మాత్రమేనని, జీవితం వాటికి ఎంతో అతీతమైనదని చెప్పే ప్రయత్నం చేయడంలో సమాజం ఎక్కడో విఫలమైందని ఈ ఘటన గుర్తుచేస్తోంది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి, ఫలితాల భయం ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. సంజయ్ మరణం అతని కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ దుఃఖ సమయంలో వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాదు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని నింపడం, పరీక్షలను కేవలం ఒక మైలురాయిగా చూడటం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.