జీఎస్టీ రేట్లలో మార్పుల తర్వాత, అక్టోబర్ GST వసూళ్లు విడుదలయ్యాయి. జీఎస్టీ రేట్లు తగ్గించినప్పటికీ వసూళ్లు ఘణనీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో మొత్తం GST వసూళ్లు 4.6% పెరిగి సుమారు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. GST మినహాయింపులు, పండుగ సీజన్‌లో మంచి షాపింగ్ ఈ పెరుగుదలకు దోహదపడ్డాయని నిపుణులు తెలిపారు. వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వరకు 375 వస్తువులపై వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు సెప్టెంబర్ 22 నుంచి సవరించారు. దీంతో చాలా వస్తువులు చౌకగా మారాయి.
శనివారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది 2024 అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్లు కాగా తాజాగా 4.6 శాతం పెరుగుదల చూపింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లలో పన్ను వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లు, రూ.1.89 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే, అక్టోబర్‌లో GST వసూళ్లలో వార్షిక వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది, ఇది గత నెలల్లో సగటున 9 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉంది.
Also Read:Ponnam Prabhakar : కేటీఆర్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలి
దేశీయ ఆదాయం అక్టోబర్‌లో 2 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతి పన్నులు దాదాపు 13 శాతం పెరిగి రూ. 50,884 కోట్లకు చేరుకున్నాయి. GST వాపసు కూడా సంవత్సరానికి 39.6 శాతం పెరిగి రూ. 26,934 కోట్లకు చేరుకుంది. అక్టోబర్ 2025లో నికర GST ఆదాయం రూ. 1.69 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే 0.2 శాతం వృద్ధి సాధించింది.