Zoho’s Sridhar Vembu: జోహో సహ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యువతకు ఆయన పెళ్లి గురించి సూచిస్తూ.. ‘‘ పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లల్ని కనండి’’ అని సలహా ఇచ్చారు. యువకులు సమాజానికి, మన పూర్వికుల పట్ల వారి జనాభా విధిని నేరవేర్చడానికి వివాహం చేసుకోవాలని ఆయన చెప్పారు. నేను కలిసే యువ పారిశ్రామికవేత్తలకు, పురుషులకు, మహిళలకు ఇదే లసహా ఇస్తున్నానని వెంబు తన ఎక్స్‌లో రాశారు. ఈ భావన వింతగా లేదా పాతకాలం నాటిదిగా అనిపించవచ్చు. కానీ ఈ ఆలోచనలు మళ్లీ ప్రతిధ్వనిస్తాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఆయన అన్నారు.
నటుడు రామ్‌చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల సోషల్ మీడియా పోస్ట్‌కు రిప్లైగా వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉపాసన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో మాట్లాడిన అనుభవాలను పంచుకున్నారు. ఎవరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు..? అని ఆమె ప్రశ్నించగా.. ఎక్కువ మంది అబ్బాయిలు ఎక్కువగా చేతులు పెకెత్తారు. దీంతో అమ్మాయిలు కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆమె అన్నారు. దీనికి ప్రతిస్పందనగా వెంబు.. యువత 20 ఏళ్ల లోపే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని సూచించారు.
Read Also: Chelluboyina Venu: కులాన్ని.. కులంలోని కొందరిని తిట్టడానికే వన భోజనాలను అడ్డం పెట్టుకున్నారు..
వెంబు వ్యాఖ్యలపై యువత మిశ్రమంగా స్పందించారు. చిన్న వయసులోనే వివాహం, కుటుంబ ఏర్పాటుకు నిజమైన అడ్డంకి సాంస్కృతిక సంకోచం కాదు, ఆర్థిక ఒత్తిడి అని ఒక యూజర్ అన్నారు. అస్థిరమైన ఆదాయాలు, తీవ్రమైన పనిగంటలు, ఆదాయంతో గణనీయమైన వాటా అద్దెలకు వెళ్తుందని అతను చెప్పాడు. ఇది జనాభా సంక్షోభం కాదని, ఆర్థిక సంక్షోభం అని మరో యూజర్ అన్నారు. దీనికి వెంబూ ప్రతిస్పందిస్తూ.. ‘‘భరించగలిగే వ్యక్తులు కూడా వివాహం చేసుకోవడం లేదని, పిల్లల్ని కనడం లేదని’’ ఆయన అన్నారు. ఒక మహిళ.. ‘‘నేను అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలను కనడానికి ఇష్టపడతాను. కానీ అది మాత్రమే నా జీవితంలో ఏకైక లక్ష్యం కాదు’’ అని రాసింది. దీనికి వెంబు స్పందిస్తూ.. ఏ వయసులోనైనా రాణించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అన్నారు. 28 ఏళ్ల వయసులో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, తిరిగి నిర్మించుకోవడానికి చాలా సమయం ఉందని చెప్పారు. లారీ ఎల్లిసన్ తన ప్రయాణాన్ని 31 ఏళ్ల వయసులో ప్రారంభించారని గుర్తు చేశారు.
57 ఏళ్ల శ్రీధర్ వెంబు 1990ల చివరలో ప్రమీల శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరు అమెరికాలో ఉన్నారు. 2020లో శ్రీనివాసన్ విడాకుల కోరారు. 2020లో వెంబు తమిళనాడుకు వెళ్లిన తర్వాత వివాహాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వాట్సాప్ ద్వారా తనకు తెలియజేశాడని ఆమె ఆరోపించింది. తన అనుమతి లేకుండా జోహోలోని వాటాలను తన సోదరి, బంధువులకు బదిలీ చేశారని ఆమె పేర్కొంది.