Asaduddin Owaisi: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ కూడా ఇలాంటి విమర్శలనే చేసింది.
Read Also: Israel: లెబనాన్‌కు నెతన్యాహు వీడియో వార్నింగ్.. గాజాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరిక
తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఓటమిపై స్పందించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. హర్యానాలో అధికార బీజేపీపై వ్యతిరేక ఉన్నప్పటికీ, కాంగ్రెస్ బీజేపీని ఓడించలేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈవీఎంలపై నిందలు వేయడం కాంగ్రెస్‌కి అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విజయానికి కాంగ్రెస్ కారణమని, హర్యానాలో వారే ప్రతిపక్షంగా ఉన్నారని చెప్పారు.
‘‘ఈవీఎంలను నిందించడం చాలా సులువు. మీరు ఈవీఎంల వల్లే గెలిచారు. మీరు ఓడిపోతే తప్పు. నా ఉద్దేశం ప్రకారం బీజేపీ ఈ రాష్ట్రంలో(హర్యానా)లో ఓడిపోవాల్సింది. వారికి అనేక విసయాలు వ్యతిరేకంగా ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. పదేళ్లపాటు అధికార వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బీజేపీకి లాభం చేకూర్చాయని అన్నారు. ఎన్నికల పోరులో బీజేపీకి కాస్త అవకాశం ఇచ్చినా, సద్వినియోగం చేసుకుంటుందని అన్నారు.