Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో 403 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజలు కాంగ్రెస్‌కి 2 సీట్లు ఇచ్చారని అన్నారు. ఒక వ్యక్తి అంత్యక్రియల సమయంలో అంతిమ యాత్రకు నలుగుకు వ్యక్తులు కావాలి, కానీ వారికి ఇద్దరు మాత్రమే ఉన్నారు, వచ్చే సారి వారి గేమ్ ఓవర్ అంటూ వ్యాఖ్యానించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం ‘‘రామ్ నామ్ సత్య హై’’ అని నినాదాలు చేస్తూ నలుగురు వ్యక్తులు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్తారని ఆయన అన్నారు. 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లలో కేవలం 2 స్థానాలకే పరిమితమై కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఆ పార్టీకి 2.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
Read ALSO: OMG : వెన్నెల కిషోర్ “ఓ మంచి ఘోస్ట్ “కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్.. భయపెడుతున్న గ్లింప్స్ వీడియో..
అమేథీలో, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ యూపీలో పోటీ చేసే సాహసం చేయకుండా పారిపోతున్నారని సీఎం అన్నారు. అయితే, 24 గంటల్లో ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటిస్తుందని ఆ పార్టీ నేత జైరాం రమేష్ ఈ రోజు చెప్పారు. అభ్యర్థులను ప్రకటించే నిర్ణయం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు వెల్లడించారు.
మే 20న ఈ రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుంచి పోటీ చేసి బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. రాయ్‌బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉండీ, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 స్థానాలు ఉంటే సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది.