Woman In Hijab Harassed: మహారాష్ట్ర ఔరంగాబాద్ దుర్మార్గమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. సదరు అమ్మాయి హిందూ యువకుడితో తిరుగుతోందని అనుమానించిన వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ గా మారడంతో పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఔరంగాబాద్ నగరంలోని బేగంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మకై గేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Uttar Pradesh: ప్రియురాలి పెళ్లి ఆపేందుకు యువకుడి డ్రామా.. చివరికి ఏం జరిగిందంటే..?
ఈ వీడియోలో హిజాబ్ ధరించిన యువతిని వేధించడంతో పాటు ఆమెను దూషించడం, ఆమె మొబైల్ ఫోన్ లాక్కోవడం కనిపిస్తోంది. ఆ మహిళ తన సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాల్సిందిగా ముగ్గురిని వేడుకోవడం వీడియోలో రికార్డ్ అయింది. అయితే ఈ ఘటనపై బాధితురాలిని పోలీసులు గుర్తించారు. అయితే ఫిర్యాదు చేయమని కోరగా, ఆమె నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ముస్లిం యువతి, హిందూ యువకుడితో తిరుగుతోందని అనుమానించిన ముగ్గురు యువకులు ఆమెను వేధించారు. మహిళ ఫిర్యాదు చేయడానికి నిరాకరించడంతో ‘సుమోటో’గా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ దీపక్ గిర్హే తెలిపారు. ఔరంగాబాద్‌లోని ప్రసిద్ధ బీబీ కా మక్బారాను సందర్శించేందుకు ఆ మహిళ వచ్చిందని మరో పోలీసు అధికారి తెలిపారు.