Himanta Biswa Sarma: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని విమర్శిస్తున్నప్పటికీ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చట్టం అమలుకు మొగ్గుచూపింది. అయితే, ఈ చట్టంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)కి దరఖాస్తు చేసుకోని వ్యక్తికి పౌరసత్వం లభిస్తే తాను రాజీనామా చేసే మొదటి వ్యక్తి తానేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం అన్నారు. సీఏఏ అమలుపై అస్సాం వ్యాప్తంగా నిరసన చెలరేగిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Amit Shah: బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అజెండా ఒక్కటే..
నేను అస్సాం పుత్రుడిని, ఎన్ఆర్సీకి దరఖాస్తు చేసుకోని ఒక్క వ్యక్తి కూడా పౌరసత్వం పొందలేడని, ఒక వేళ పౌరసత్వం పొందితే మొదట రాజీనామా చేసేది నేనే అని శివసాగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏ అమలు తర్వాత లక్షలాది మంది రాష్ట్రంలోని ప్రవేశిస్తారని ఆ రాష్ట్ర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. అమలులోకి వచ్చిన కొత్త సీఏఏ చట్టంలో కొత్తగా ఏం లేదని, గతంలో ఏముందో అదే ఉందని, ప్రస్తుతం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని సీఎం అన్నారు. పోర్టల్‌లో ఉన్న డేటా ద్వారా అంతా తెలుస్తుందని, చట్టాన్ని వ్యతిరేకించే వారి వాదన వాస్తవంగా సరైందా, కాదా అనేది స్పష్టంగా తెలుస్తుందని హిమంత అన్నారు.
సీఏఏ నిబంధనలు జారీ చేయడంతో డిసెంబర్ 31, 2014 వరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం లభిస్తుంది. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వం దక్కుతుంది.