Asaduddin Owaisi: ఉత్తర్ ప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ పై రాజకీయ దుమారం రేగుతోంది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను ఫిబ్రవరిలో హత్య చేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్, అతని కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు. కేసు ట్రయల్స్ దగ్గర పడటంతో సాక్షి అయిన ఉమేష్ పాల్ ను హత్య చేశారు. ఈ హత్యలో అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ తో పాటు మరో గులాం అనే వ్యక్తి ప్రధాన నిందితులుగా ఉన్నారు. తాజాగా గురువారం ఝాన్సీ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిద్దరు మరణించారు.
Read Also: Odisha: హనుమాన్ జయంతి బైక్ ర్యాలీపై దాడి.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు..
అయితే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, బీజేపీ కోర్టులపై నమ్మకం లేదని ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సీఎం యోగీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైైసీ ఈ ఎన్ కౌంటర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నిజామాబాద్ లో మాట్లాడుతూ.. జునైద్, నసీర్ లను చంపిన వారిని కూడా బీజేపీ ఇలాగే కాల్చి చంపుతుందా..? అని ప్రశ్నించారు. ఫిబ్రవరిలో గో సంరక్షకులచే ఈ ఇద్దరు వ్యక్తలు చంపబడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. హర్యానాలో ఓ కారులో జునైద్, నసీర్ కాలిన మృతదేహాలు ఉన్నాయి.
మతం పేరుతో బీజేపీ ఎన్ కౌంటర్లు చేస్తుంది అని ఓవైసీ మండిపడ్డారు. మీరు చట్ట పాలనను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు, రాజ్యాంగాన్ని ఎన్ కౌంటర్ చేస్తున్నారని విమర్శించారు. మనకెందుకు కోర్టులు, చట్టం, సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ఎందుకు ఉన్నాయి అని ప్రశ్నించారు. ఇలా ఎన్ కౌంటర్ల ద్వారా హత్యలు చేయాలనుకుంటే న్యాయమూర్తులు ఎందుకు ఉన్నారని అన్నారు. హంతకులను పట్టుకోవడం మీ పని, ఎవరైనా చంపితే జైలుకు పంపండి అని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బుల్డోజర్ న్యాయంపై మాట్లాడుతూ.. ఎవరైనా చంపితే బుల్డోజర్లతో వారి ఇళ్లను నాశనం చేయడంపై ప్రశ్నించారు.