Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఎవరూ ఊహించి ఉండరు. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 09 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఎన్డీయే కూటమిగా 17 సీట్లను గెలుచుకోగా, ఇండియా కూటమి ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఫలితాలకు తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసి, పార్టీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
Read Also: Hypersonic Missile: మాస్కోను 30 నిమిషాల్లో తాకే హైపర్ సోనిక్ మిస్సైల్‌ని పరీక్షించిన యూఎస్..
అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ స్పందించారు. అతని రాజీనామా ప్రతిపాదన కేవలం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఒత్తిడి తీసుకురావడానికే అని జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కొత్త ఎన్డీయే సర్కార్ ఎక్కువ రోజులు నిలవదని జోస్యం చెప్పారు. ‘‘యోగిపై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా కుట్ర చేస్తున్నాడు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ నాయకత్వంలో బీజేపీ ఓడిపోతే, ఉత్తరప్రదేశ్‌లో యోగి నాయకత్వంలో ఓడిపోయింది. అందుకే ఫడ్నవీస్ రాజీనామా గురించి మాట్లాడుతున్నారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ ఫలితాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ దారుణంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీలో చీలికల ప్రభావం బీజేపీపై పడింది. శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) మంచి ఫలితాలను సాధించాయి. కాంగ్రెస్ 13 సీట్లను గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్‌లోని 80 సీట్లలో బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఏకంగా 37 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. రామ మందిర నిర్మాణం, పటిష్టమైన బీజేపీ బలగం ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఆశించినంత ఫలితాలను సాధించలేదు. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది.