Bengaluru Water crisis: వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు.. కోవిడ్‌ని గుర్తు చేస్తున్న బెంగళూర్ నీటి సంక్షోభం..బెంగళూర్ వాసులకు నీటి కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. ఎండలు పూర్తిగా ముదరకముందే సిలికాన్ వ్యాలీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వ కష్టపడుతోంది. ఇప్పటికే చాలా వరకు అపార్ట్‌మెంట్లలో నీరు లేదు. దీంతో వారంతా డిస్పోజబుల్ ప్లేట్లను, వెట్ వైప్‌లను వాడుతున్నారు. మరికొందరు సమీపంలోని మాల్స్‌లకి కస్టమర్లలా వెళ్లి కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. మరో మూడు నాలుగు నెలలు కానిదే రుతుపవనాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పటి వరకు బెంగళూర్ వాసులకు నీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే కోవిడ్-19 మహమ్మారి సమయంలో పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు బెంగళూర్ పరిస్థితి అలా తయారైంది. విద్యా సంస్థలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నడుపుతున్నాయి. నగరంలోని ఓ కోచింగ్ సెంటర్ తన విద్యార్థులను వారం పాటు ఆన్లైన్ క్లాసులకు హాజరుకావాల్సిందిగా కోరింది. అదేవిధంగా బన్నేరుఘట్టలో ఓ పాఠశాల మూతపడింది. ఇక పలు కుటుంబాలు నీటి సంక్షోభం కారణంగా వేరేదారి లేక స్నానాలు చేయడం మానేస్తున్నారు. కొందరు ఇంట్లో వంటలు చేసుకోకుండా ఆన్లైన్ ఆర్డర్లతో కాలం వెల్లతీస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే బట్టలను వాషింగ్ మెషిన్లలో వేస్తున్నారు.
ఇక ఐటీ ఉద్యోగుల కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఇన్నాళ్లు ఆఫీసులకు వచ్చి పనులు చేయమని చెప్పిన కంపెనీలు నీటి సంక్షోభం కారణంగా వర్క్ ఫ్రం హోం(WFH) చేయాలని అభ్యర్థిస్తున్నాయి. వేరే రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు నీటి సంక్షోభం కారణంగా సొంతూళ్లకు పయణమవుతున్నారు. బెంగళూర్‌కి ప్రధాన నీటి వనరులైన కావేరీ నది, భూగర్భ జలాలే ఆధారం. అయితే అవి చాలా వరకు ఎండిపోయాయి. బెంగళూర్లో రోజుకు 2600-2800 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం అందులో సగం మాత్రమే నగరవాసులకు అందుతోంది. బెంగళూర్ శివారు ప్రాంతాలైన 2007లో విలీనమైన 110 గ్రామాల ప్రజలు కూడా ఈ భారాన్ని భరిస్తున్నారు. ఇదిలా ఉంటే నీటి సంక్షోభం అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తోంది. అయితే కేంద్రం సాయం చేయడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.