China: సరిహద్దు వివాదంపై భారత్- చైనాల మధ్య దౌత్య సంబంధాలు పురోగతి చెందుతున్నాయి. ఈక్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలనే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యాలు చేశారాయన. కాగా, రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోడీతో చైనా అధినేత జిన్‌పింగ్ ఇరు దేశాల మధ్య సంబంధాల బలపడటానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు వాంగ్ యీ పేర్కొన్నారు. ఇరు దేశాలు అభివృద్ధి చెందేందుకు ఢిల్లీతో కలిసి పని చేసేందుకు రెడీగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వెల్లడించారు.
Read Also: YS Jagan: నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్!
అయితే, ఆసియా దేశాలతో స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని వాంగ్ యీ చెప్పుకొచ్చారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు చైనాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు ప్రాంతంలో శాంతిపై వాంగ్ యీ, అజిత్ దోవల్ చర్చించనున్నారు. ఇక, ఇటీవల పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. చైనా చర్యల వల్ల 2020లో సరిహద్దులో శాంతికి భంగం వాటిల్లిందన్నారు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. కాగా, నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మెరుగుదల కనిపించిందని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు.