Lok Sabha Elections 2024: తెలంగాణ సరిహద్దు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ ఎంపీ స్థానాల్లో తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టులకు షెల్టర్లుగా ఉన్న గడ్చిరోలి, బస్తర్ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లను చేశారు.
గడ్చిరోలి-చిమూర్, చంద్రపూర్ ఎంపీ స్థానాలు మంచిర్యాల, కుమ్రంభీం, భూపాలపల్లి సిరిహద్దుల్లో గోదావరి, ప్రాణహిత నదులకు అటువైపుగా ఉన్నాయి. గడ్చిరోలి నుంచి అశోక్ నేతే బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి నుంచి డా. నామ్‌దేవ్ దసరమ్ కిర్సన్ పోటీలో ఉన్నారు. ఇక చంద్రపూర్ నుంచి బీజేపీ కీలక నేత సుధీర్ మునిగంటి వార్ పోటీ చేస్తుండగా..ఇండియా కూటమి నుంచి ప్రతిభా ధనోర్కర్ పోటీలో ఉన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: ఎన్నికల పండగకు అంతా సిద్ధం.. రేపు తొలి విడత పోలింగ్..
మరోవైపు ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ ఎంపీ స్థానానికి కూడా రేపే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దీంట్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. ప్రస్తుతం అక్కడి పరిణామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని ఇప్పటికే మావోయిస్టులు పిలుపునివ్వడంతో అక్కడ భద్రతా బలగాలు మోహరించాయి. బస్తర్ లోక్‌సభ పరిధిలో దంతెవాడ, బీజాపూర్, కొండగావ్, నారాయణపూర్, చిత్రకూట్, కుంటా, జగదల్‌పూర్ అసెంబ్లీలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూతుల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఇక బస్తర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జగదల్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
బస్తర్ ఎంపీ పరిధిలోని బీజాపూర్ జిల్లా భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలతో సరిహద్దు పంచుకుంటోంది. ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల భద్రతా సిబ్బంది, పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత లఖ్మా బస్తర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కశ్యప్‌పై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ దీపక్ బైజ్‌కి టికెట్ నిరాకరించి, కాంగ్రెస్ లఖ్మాను పోటీకి దింపింది.