Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లు తమ చైతన్యాన్ని చూపారు. 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. గతంలో 2018 ఎన్నికల నమోదైన 72.44 శాతంతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా రికార్డ్ అయింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చినా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తాయని వెల్లడించాయి.
అయితే ఎప్పుడూ లేని విధంగా కన్నడ ఓటర్లు రికార్డ్ క్రియేట్ చేశారు. రికార్డ్ ఓటింగ్ శాతం నమోదు అయింది. 1952 తర్వాత ఇప్పుడే తొలిసారిగా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అయింది. మొత్తం 5,30,85,566 ఓటర్లలో 3,88,51,807 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 73.68 శాతం కాగా.. మహిళలు 72.70 శాతం, ఇతరులు 21.05 శాతం ఉన్నారు. ఒవరాల్ గా 73.19 శాతం పోలింగ్ నమోదు అయింది.
Read Also: Bandi Sanjay : కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
చిక్కబళ్లాపూర్ జిల్లాలో అత్యధికంగా 85.83 శాతం, రామనగరంలో 84.98 శాతం పోలింగ్ నమోదైంది. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ సమయంలో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. గత 38 ఏళ్లుగా వరసగా ఏ పార్టీకి కూడా వరసగా రెండో సారి అధికారాన్ని కట్టబెట్టలేదు కన్నడ ప్రజలు. అయితే ఈ సారి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి.
ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ కన్నడనాట విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఒకవేళ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మరోసారి జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్రను పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ‘భజరంగ్ ధళ్’ బ్యాన్ చేస్తామని ప్రకటించడం బీజేపీకి ఆయుధంగా మారింది. చివరి రోజుల్లో భజరంగబలి నినాదాలతో ప్రచారం మారుమోగింది. ప్రధానిని ‘విషసర్పం’గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభివర్ణించడం కూడా వివాదాస్పదం అయింది. దీనికి ప్రతిగా బీజేపీ సోనియాగాంధీని ‘విష కన్య’తో పోల్చారు.