VK Sasikala reacts to Arumughaswamy commission’s report: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై అరుముగస్వామి కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆ రాష్ట్రంలో హీట్ పెంచుతోంది. కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే కమిషన్ జయలలిత స్నేహితురాలు వీకే శశికళతో పాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని ఇచ్చిన రిపోర్టును ఆమె వ్యతిరేకించారు. జయలలిత చికిత్సలో తానెప్పుడు కలుగచేసుకోలేదని, ఆమె మరణంలో నా పాత్ర లేదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మంగళవారం అరుముగస్వామి రిపోర్టును ప్రవేశపెట్టారు.
జయలలిత మరణంలో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తో పాటు వీకే శశికళ, ఇద్దరు అధికారులపై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. తప్పు తప్పకుండా వారిదే అని కమిషన్ పేర్కొంది. అనుమానితులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ తనపై అనుమానం వ్యక్తం చేయడంపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత పరువు తీసేందుకే డీఎంకే ఇలా చేస్తోందని విమర్శించారు. నన్ను ఇందులో ఇరికించడంపై అభ్యంతరం లేదని.. అయితే తన సోదరి జయలలిత పరువు తీసేలా డీఎంకే వ్యూహం పన్నిందని అన్నారు. నన్ను రాజకీయాల నుంచి బహిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని.. అమ్మ మరణాన్ని దీని కోసం వాడటం దారుణమని అన్నారు. గతంలో జయలలిత మరణాన్ని రాజకీయం చేశారు. ప్రస్తుతం అరుముగస్వామి కమిషన్ నివేదికను ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారని మండిపడ్దారు.
జయలలిత మరణంలో ఏ విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తనకు జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు జయలలితతో ఉన్నానని.. ఆమె చికిత్సలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని.. నేను కోరుకున్నదల్లా ఆమెకు మంచి చికిత్స అందించాలని.. ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తీసుకెళ్లడాన్ని నేను ఎప్పుడు ఆపలేదని ఆమె అన్నారు. ఎయిమ్స్ వైద్యులు కూడా యాంజియో అవసరం లేదని నిర్ణయించారని.. ఊహల ఆధారంగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని ప్రజలు నమ్మరని శశికళ అన్నారు. నాపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధాలే అని ఆమె అన్నారు.