Viral Photo: సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆటోలు, బస్సులు, రైళ్లలో వెళ్తూ పుస్తకాలు తీసి తెగ చదివేస్తుంటారు. ఏడాది మొత్తం చదవకపోయినా పరీక్షల ముందు మాత్రం విద్యార్థులు తెగ చదివేయాలని తపన పడుతుంటారు. అయితే రైల్వే ప్లాట్‌ఫారాలపై గుంపులుగా విద్యార్థులందరూ ఒకచోట చేరి చదువుకోవడం మాత్రం కనిపించదు. మహా అయితే ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఇలా కనిపిస్తారు. కానీ బీహార్ రాష్ట్రంలోని ససారం రైల్వేస్టేషన్‌లో మాత్రం ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. దీంతో సదరు రైల్వేస్టేషన్ యూనివర్సిటీ క్యాంపస్‌ను తలపిస్తుంది.
Read Also: Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు
బీహార్‌లోని ససారం బాగా వెనకబడిన ప్రాంతం. కానీ చరిత్ర మాత్రం గొప్పది. ఇక్కడి కోచింగ్ సెంటర్లు పోటీ పరీక్షలకు ప్రత్యేకం అని పేరు పొందాయి. కంప్యూటర్ కోర్సులు నేర్చుకునేవాళ్లకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బ్యాంక్ కోచింగ్ తీసుకునేవాళ్లకు నంద్యాల ఎలా ప్రసిద్ధో.. బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునే వాళ్లకు ససారంలోని కోచింగ్ సెంటర్లు ఫేమస్. ఈ కారణంగా ససారం చుట్టుపక్కల పల్లెల నుంచి పట్టణాల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు. అందుకే ఈ రైల్వేస్టేషన్ ఉదయం, సాయంత్రం రద్దీగా కనిపిస్తుంటుంది. విద్యార్థులు రైల్వేస్టేషన్‌లోనే బుద్ధిగా కూర్చుని చదువుకుంటూ కనిపిస్తారు. చీకటి పడితే కరెంటు స్తంభాల లైట్ల వెలుగులో చదువుకుంటారు. పొద్దున పూట ప్లాట్ ఫారం మొత్తం విద్యా్ర్థులే కనబడతారు. ఈ ప్రాంతం నుంచి పోటీ పరీక్షలలో పాసయిన వారు, పాస్ కాకపోయినా పరీక్షలు రాసి అనుభవం సంపాదించిన వాళ్లు ఇక్కడి వచ్చి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తుంటారు.