Vijay Diwas: 1971, డిసెంబర్ 16న పాకిస్తాన్‌పై భారత్ అఖండ విజయం సాధించి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. తూర్పు పాకిస్తాన్‌గా పిలుబడుతున్న నేటి బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ అకృత్యాలు, అత్యాచారాలను ఎదురించి, పాక్ సైన్యాన్ని మట్టికరిపించింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులతో అప్పటి పాక్ కమాండర్ నియాజీ భారత్ సైన్యం ముందు లొంగిపోయారు. అయితే, ఆ యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వం చురుకైన పాత్రను పోషించింది. కానీ, యాహ్యా ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ సైన్యం ఓటమి అంచులో ఉన్న సమయంలో, పాక్ అమెరికా సాయాన్ని కోరడం, అమెరికా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవడం, ఇదే సమయంలో రష్యా భారత్‌కు మద్దతుగా రావడం అప్పటి యుద్ధ స్వరూపాన్నే మార్చేసింది. ఈ పరిణామంలో భారత్ పాకిస్తాన్‌ను ఓడించి, బంగ్లాదేశ్ ఏర్పాటు చేయగలిగింది.
భారత్ వైపు నిలబడ్డ రష్యా..
పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా, బ్రిటన్‌లు ఈ యుద్ధంలో నిలిచాయి. భారత తూర్పు తీరాన్ని దెబ్బతీసేందుకు అమెరికా నేవీ ఏకంగా తన సెవన్త్ ఫ్లీట్ టాస్క్ ఫోర్స్-74 ను బంగాళాఖాతంలోకి పంపింది. అమెరికా అధ్యక్షుడు రికర్డ్ నిక్సన్ పాక్‌కు పూర్తి మద్దతు ప్రకటించాడు. అయితే, రష్యా భారత్‌కు అండగా నిలుస్తుందని అమెరికా అస్సలు ఊహించలేదు. భారత్‌కు అండగా రష్యా నిలవడంతో చేసేదేం లేక అమెరికా వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ పరిణామమే ఇప్పటికీ భారత్-రష్యాల మధ్య స్నేహాన్ని కొనసాగేలా చేస్తోంది. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునాది వేసింది. ఇటీవల పుతిన్ కూడా భారత పర్యటనకు వచ్చారు.
యుద్ధానికి కారణమైన పాక్ ఆర్మీ:
1971లో తూర్పు పాకిస్తాన్‌లో షేక్ ముజబుర్ రెహ్మాన్ పార్టీ గెలుపొందటం అప్పటి పాక్ సైనిక నియంత యాహ్య ఖాన్‌కు నచ్చలేదు. ఆ ప్రాంతంలో బలపడుతున్న బెంగాలీ జాతీయవాదం మొత్తం పాకిస్తాన్‌కే ప్రమాదమని భావించి, ‘‘ఆపరేషన్ సెర్చ్ లైట్’’ ప్రారంభించారు. బెంగాలీ జనాభాను అణిచివేయడం ప్రారంభించాడు. అనేక మంది బంగ్లాదేశ్ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాక్ ఆర్మీ పాల్పడింది. ఆ సమయంలో లక్షలాది శరణార్థులు భారత్‌లోకి ప్రవేశించడం ప్రారంభించారు.
ఇది భారత ఆర్థిక వ్యవస్థ, సామాజిక మౌలిక సదుపాయాలు, అంతర్గత భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారు. భారత్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కేవలం సైనిక పరిష్కారమే మార్గమని భావించి, యుద్ధంలోకి దిగారు.
యుద్ధాన్ని మలుపుతిప్పిన ఒప్పందం:
1962లో చైనా యుద్ధంలో భారత్ పరాజయం తర్వాత, దేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌కు అప్పటి ప్రధాన శక్తులైన అమెరికా, యూకే, చైనాల మద్దతు ఉంది. ఈ సమయంలోనే భారత్-రష్యాల మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం జరిగింది. ఆగస్టు 9, 1971న న్యూఢిల్లీలో రెండు దేశాలు సంతకం చేశాయి. భారతదేశం సోవియట్ యూనియన్‌తో శాంతి, స్నేహం మరియు సహకార ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందంలో ‘‘ఏ దేశంపైనైనా దాడి జరిగితే, మరొక దేశం “అటువంటి ముప్పును తొలగించడానికి” జోక్యం చేసుకుంటుంది’’ అనేది ప్రధానంగా ఉంది.
రక్షించిన రష్యా:
అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, బంగాళాఖాతంలోకి భారత్‌ను బెదిరించేలా అణుశక్తితో నడిచే USS ఎంటర్‌ప్రైజ్ విమాన వాహక నౌకతో సహా US నేవీ యొక్క సెవెంత్ ఫ్లీట్‌ను మోహరించాడు. యూకే కూడా తన విమాన వాహక నౌకను అరేబియా సముద్రంలోకి పంపింది. భారత్‌ను మూడు వైపుల నుంచి ముట్టడించే ప్రయత్నం చేసింది.
ఈ పరిణామంతో రష్యా ఎంటర్ అయింది. భారత్‌తో చేసుకున్న ఒప్పందం అమలులోకి వచ్చింది. మాస్కో వేగంగా స్పందించి..వ్లాడివోస్టాక్ నుంచి సోవియట్ తన పసిఫిక్ నౌకాదళాన్ని పంపింది. మాస్కో నేవీ భారత్ జలాల్లో మోహరించింది. అణుజలంతర్గాముల్ని రష్యా మోహరించింది. సోవియట్ జలాంతర్గాములు సముద్రంపైకి చేరుకోవడం చూసిన అమెరికన్, బ్రిటన్ దళాలు వెనక్కి తగ్గాయి.