Vice President Salary And Benefits: ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. ఆ వెంటనే నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలను అందుకుంటారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఆయన ఘనవిజయం సాధించారు. శనివారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్‌కు 528 ఓట్లు రాగా.. యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు పోలయ్యాయి. అయితే ఓ వ్యక్తి ఉపరాష్ట్రపతి కావాలంటే ముందుగా భారతీయుడు అయ్యి ఉండాలి. 35 ఏళ్లు నిండి రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉంటే మాత్రమే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడతారు. సదరు వ్యక్తి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా లాభదాయకమైన పదవిని కలిగి ఉంటే కూడా అనర్హుడు.
Read Also: Honeymoon Record: పదేళ్లు.. 65 దేశాలు.. హనీమూన్‌లో రికార్డు సృష్టిస్తున్న జంట
పార్లమెంట్ అధికారుల జీతాలు, అలవెన్సుల చట్టం 1953 ప్రకారం దేశంలోని ఉపరాష్ట్రపతి జీతాన్ని నిర్ణయిస్తారు. ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్లు రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా ఉంటారు. దీంతో ఆ స్థాయిలోనే జీతం, ప్రయోజనాలను అందుకుంటారు. పార్లమెంట్ నివేదిక ప్రకారం ఉపరాష్ట్రపతికి నెలవారీ వేతనంగా రూ.4లక్షలు అందిస్తారు. అంతేకాకుండా రకరకాల అలవెన్సులు కూడా అందజేస్తారు. గతంలో ఉపరాష్ట్రపతికి నెలకు రూ.1.25లక్షల వేతనం ఉండగా.. 2018 బడ్జెట్‌లో దీన్ని రూ.4లక్షలకు పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలోని మౌలానా ఆజాద్ రోడ్‌లో ఉపరాష్ట్రపతి భవన్ ఉంది. ఈ భవనం 6.48 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ భవనంలోనే ఉపరాష్ట్రపతి నివసిస్తారు.
ఉపరాష్ట్రపతికి వేతనంతో పాటు ఉచిత వైద్యం, రైళ్లు, విమానాల్లో ఉచిత ప్రయాణాలు వంటి ఇతర సదుపాయాలు అందుతాయి. అంతేకాకుండా ఉచిత ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోను కనెక్షన్లు ఇస్తారు. వ్యక్తిగత భద్రత, సిబ్బందిని కూడా ప్రభుత్వమే నియమిస్తుంది.ఒకవేళ ఏదైనా కారణాలతో రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు రాష్ట్రపతికి అందే వేతనం, ఇతర సదుపాయాలు లభిస్తాయి. పదవీ విరమణ తర్వాత ఉపరాష్ట్రపతికి తమ వేతనంలో 50శాతం పింఛనుగా లభిస్తుంది. దీంతో పాటు ఇతర సదుపాయాలు కూడా కొనసాగుతాయి. కాగా నూతన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌కు ప్రధాని మోదీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.