Vande Bharat Trains: ఇండియన్ రైల్వే ప్రతిష్టాత్మకంగా సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టింది. దేశం మొత్తం ఇప్పుడు 68 వందేభారత్ రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రైళ్లను 14 నిమిషాల్లోనే శుభ్రం చేయాలనే కొత్త విధానాన్ని రైల్వేశాఖ తీసుకురాబోతోంది. ‘ 14 మినిట్స్ ఆఫ్ మిరాకిల్’ కాన్సెప్టును అక్టోబర్ 1 నుంచి ప్రవేశపెడుతోంది. రైళ్లు ప్రారంభయమ్యే వాటి గమ్యస్థానాల్లో ఈ విధానం ప్రారంభం కానుంది. ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ లో దీన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు.
వందేభారత్ రైళ్ల సమయపాలన కోసం కేవలం 14 నిమిషాల్లోనే వాటిని శుభ్రం చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇది ప్రత్యేకమైన కాన్సెప్ట్ అని భారతదేశంలో తొలిసారిగా ఈ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. జపాన్ లోని ఒసాకా, టోక్యో వంటి స్టేషన్లలో ‘7 మినిట్స్ ఆఫ్ మిరాకిల్’ అనే కాన్సెప్ట్ ఆధారంగా భారత రైల్వేలు దీన్ని తీసుకురాబోతున్నాయి. జపాన్ లోని బుల్లెట్ రైళ్లను 7 నిమిషాల్లో శుభ్రం చేసి ప్రయాణానికి సిద్ధం చేస్తారు.
Read Also: Communal Tension: జైపూర్‌లో మత ఉద్రిక్తత.. అపార్ధం చేసుకుని ఒక వ్యక్తి హత్య..
రైలు క్లీనింగ్ లో నిమగ్నమై ఉన్న వర్కర్ల సంఖ్యను పెంచకుండా వారి యొక్క శుభ్రపరిచే సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఈ 14 నిమిషాల కాన్సెప్ట్ సాధ్యమైందని రైల్వే మంత్రి చెప్పారు. ఢిల్లీ స్టేషన్ లోనే కాకుండా వందేభారత్ రైళ్ల రాకపోకలను బట్టి వారణాసి, గాంధీనగర్, మైసూర్, నాగ్‌పూర్ స్టేషన్లలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఈ కాన్సెప్ట్ ప్రారంభించే ముందు రైల్వేలు రెండు డ్రై రన్‌లను నిర్వహించాయి. మొదటిసారిగా అటెండెంట్లు 28 నిమిషాల్లో రైలును శుభ్రం చేస్తే, రెండోసారి 18 నిమిషాల్లోనే సాధ్యమైంది, అయితే ఇప్పుడు ఎలాంటి కొత్త టెక్నాలజీ లేకుండా కేవలం 14 నిమిషాల్లోనే ఇది సాధ్యపడుతోందని మంత్రి చెప్పారు. వందేభారత్ లో ప్రారంభమైన ఈ ప్రక్రియను క్రమంగా ఇతర రైళ్లకు కూడా వర్తింప చేస్తామని అన్నారు.