Communal Tension: రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో మత ఉద్రిక్తతలు ఏర్పడింది. రామ్‌గంజ్ పరిసర ప్రాంతాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు మోటార్ సైకిళ్ల యాక్సిడెంట్ తరువాత ఒక గుంపు తీవ్రంగా కొట్టడం వల్ల ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటన శనివారం నగరంలో ఉద్రిక్తతను పెంచింది. అయితే అవగాహన లోపంతో ఇది జరిగిందని సిటీ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ తెలిపారు.
Read Also: Manipur: రెండు దేశాల టెర్రరిస్టులతో మణిపూర్ వ్యక్తి కుట్ర.. అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
సుభాష్ చౌక్ ప్రాంతంలో రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఆ తరువాత అక్కడే ఉన్న కొంతమంది గుంపు ప్రమాదాన్ని తప్పుగా భావించి ఇద్దర్ని దారుణంగా కొట్టారు. నిజానికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగిందో చూడటానికి ఆగిన ఇద్దరు వ్యక్తులను కొట్టారని ఆయన విలేకరులతో తెలిపారు. ఇద్దరిలో ఒకరు చనిపోయారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు. నిందితులు సుభాష్ చౌక్ ప్రాంతంలో నివసిస్తున్నారని, బాధితులు రామ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
పరిస్థితి అదుపులో ఉందని, ఎస్టీఎఫ్ సహా బలగాలను మోహరించినట్లు డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు. ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని అనేక దుకాణాలు మూసేయబడ్డాయి. డ్రోన్లతో ఆ ఏరియాను తనిఖీ చేస్తున్నారు.