గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంత వరకు కంట్రోల్ కాలేదు. ఇక ఇండియాలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. 130 కోట్లమంది ఉన్న దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలంటే చాలా సమయం పడుతుంది. అవకాశం ఉన్నా కొందరు భయాలతో, అపోహలతో వ్యాక్సిన్ తీసుకోవడానికి సందేహిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో చెప్పక్కర్లేదు. పైగా పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు వారికి కరోనా సోకిందని, చనిపోయారని వార్తలు వస్తున్నాయి. దీంతో పెళ్లి విషయంలో వినూత్నంగా అలోచిస్తున్నారు అమ్మాయిలు. వరుడి కోసం పేపర్లో ఇచ్చే ప్రకటనలే అందుకు నిదర్శనం. టీకా తీసుకున్న వరుడు కావాలి అంటూ పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు. వరుడి ఉద్యోగం, జీతం కంటే ఇప్పుడు టీకాకు విలువ ఇవ్వడం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఇలాంటి ప్రకటనలు కనిపిస్తున్నాయి.